
అమరావతి: వైసీపీ అధినేత, ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇటీవల కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన వివాదస్పద వక్ఫ్ చట్టానికి వ్యతిరేకంగా సుప్రీంకోర్టును ఆశ్రయించాలని నిర్ణయించారు. అధినేత ఆదేశాల మేరకు వక్ఫ్ సవరణ చట్టాన్ని సవాల్ చేస్తూ వైసీపీ సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. మొదటి నుంచి వక్ఫ్ సవరణ బిల్లును తీవ్రంగా వ్యతిరేకిస్తోన్న వైసీపీ.. వక్ఫ్ బిల్లు చట్టంగా మారడంతో దేశ సర్వోన్నత న్యాయస్థానం మెట్లక్కింది. కాగా, కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన వివాదస్పద వక్ఫ్ సవరణ బిల్లుకు ఇటీవల ఆమోదం లభించిన విషయం తెలిసింది.
కేంద్ర బడ్జెట్ సమావేశాల్లో భాగంగా పార్లమెంట్ ఉభయ సభల్లో వక్ఫ్ సవరణ బిల్లు ఆమోదం పొందింది. అనంతరం రాష్ట్రపతి కూడా ఈ బిల్లుకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో వక్ఫ్ సవరణ బిల్లు చట్టరూపం దాల్చింది. ఈ క్రమంలోనే వక్ఫ్ చట్టానికి వ్యతిరేకిస్తూ పలు పార్టీలు సుప్రీంకోర్టును ఆశ్రయించాయి. ఆప్, కాంగ్రెస్, ఎంఐఎం, ఆర్జేడీ, ఎస్పీ వంటి పార్టీలు చట్టాన్ని సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశాయి. తాజాగా వైసీపీ కూడా ఈ పార్టీల బాటలోనే వక్ఫ్ సవరణ చట్టాన్ని ఛాలెంజ్ చేస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించడం ఏపీ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది.
ఏపీలో వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం కొంత సఖ్యతగానే ఉండేవారు. పార్లమెంట్ లో కొన్ని బిల్లుకు వైసీపీ సభ్యులు మద్దతు కూడా ఇచ్చారు. కానీ గత ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ.. టీడీపీ, జనసేనతో కూటమి కట్టి విజయం సాధించాయి. ప్రస్తుతం ఎన్డీఏ ప్రభుత్వంలో తమ రాజకీయ ప్రత్యర్థులు టీడీపీ, జనసేన మిత్రులుగా ఉండటంతో.. ఎన్డీఏ కూటమికి వైసీపీ పూర్తిగా దూరంగా ఉంటుంది. ఈ క్రమంలోనే వక్ఫ్ చట్టాన్ని సవాల్ చేస్తూ వైసీపీ సుప్రీంకోర్టును ఆశ్రయించినట్లు ఏపీ పొలిటికల్ సర్కిల్స్‌లో చర్చ జరుగుతుంది.