
సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ లను ఉద్దేశించి అసభ్యకర వ్యాఖ్యలు చేసిన కేసుల్లో నటుడు పోసాని కృష్ణమురళి అరెస్టైన సంగతి తెలిసిందే. రాష్ట్రవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో కేసులు నమోదైన క్రమంలో పోసానికి బిగ్ రిలీఫ్ లభించింది. నరసరావుపేటలో పోసానిపై నమోదైన కేసులో బెయిల్ మంజూరు చేసింది నరసరావుపేట కోర్టు. రూ.10 వేల చొప్పున రెండు పూచీకత్తులు సమర్పించాలని ఆదేశించింది కోర్టు.
ఇదిలా ఉండగా.. అన్నమయ్య జిల్లా ఓబులవారిపల్లెలో నమోదైన కేసులో కూడా గత వారమే పోసానికి బెయిల్ మంజూరు చేసింది కడప కోర్టు.కాగా, ప్రస్తుతం ఓబులవారిపల్లె, నరసరావుపేట పోలీస్ స్టేషన్లలో నమోదైన కేసుల్లో బెయిల్ లభించినా.. మరికొన్ని కేసులో మాత్రం పోసాని కొన్ని రోజులు జైలులోనే ఉండాల్సిన పరిస్థితి ఉంది. ఇప్పుడు బెయిల్ వచ్చింది రెండు కేసుల్లో మాత్రమే.. మరికొన్ని కేసుల్లోనూ పీటీ వారెంట్ పై ఆయన జైలులోనే ఉండాల్సిన పరిస్థితులు ఉన్నాయి.
పోసానిపై రాష్ట్ర వ్యాప్తంగా 30 ఫిర్యాదుల ఆధారంగా.. 16 కేసులు నమోదు అయిన సంగతి తెలిసిందే. చంద్రబాబు, నారా లోకేష్, పవన్ కల్యాణ్‌లపై అసభ్యకర వ్యాఖ్యలు చేసారంటూ టీడీపీ, జనసేన కార్యకర్తలు చేసిన ఫిర్యాదుల మేరకు పోసానిపై పలు జిల్లాల్లో కేసులు నమోదయ్యాయి. ఈ క్రమంలో.. ఫిబ్రవరి 28న హైదరాబాద్ లోని ఆయన నివాసానికి వెళ్లి పోసానిని అరెస్ట్ చేశారు అన్నమయ్య జిల్లా పోలీసులు.