కర్నూలు: వైసీపీ అధ్యక్షుడు, ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్ నంద్యాలకు చేరుకున్నారు. నంద్యాలలో జగన్కు మద్దతు తెలుపుతూ కార్యకర్తలు, అభిమానులు భారీగా తరలివచ్చారు. నంద్యాల జిల్లాలో హత్యకి గురైన వైసీపీ కార్యకర్త సుబ్బారాయుడు కుటుంబాన్ని పరామర్శించి పార్టీ అండగా ఉంటుందని జగన్ భరోసా ఇచ్చారు. అనంతరం జగన్ మీడియాతో మాట్లాడుతూ.. ఊళ్లలో ఆధిపత్యం కోసం కూటమి ప్రభుత్వం వ్యవస్థలను భ్రష్టు పట్టిస్తోందని మండిపడ్డారు. కత్తులు, రాళ్లు, రాడ్లతో గ్రామాల్లో దాడులు చేస్తున్నారని ఆరోపించారు. ఈ ప్రభుత్వానికి ప్రజలకు మంచి చేయాలన్న ఆలోచనే లేదని విమర్శించారు. ఏపీలో అరాచక పాలన సాగుతోందని, సీఎం చంద్రబాబు ప్రజలను మోసం చేశారని జగన్ ఆరోపించారు.
మహానంది మండలం సీతారామపురంలో గ్రామంలో పెద్ద సుబ్బారాయుడు దారుణ హత్యకు గురయ్యాడు. పెద్ద సుబ్బారాయుడు ఇంటిపై అర్ధరాత్రి ప్రత్యర్థులు దాడికి తెగబడ్డారు. ఇంట్లోని సామగ్రిని , వస్తువులను ధ్వంసం చేశారు. రాళ్లతో , కర్రలతో కొట్టడంతో పెద్ద సుబ్బారాయుడు అక్కడికక్కడే మృతి చెందాడు. సుబ్బారాయుడి భార్య పసుపులేటి బలసుబ్బమ్మపై కత్తులతో దాడి చేశారు. తీవ్ర గాయాలతో ఆమె ఆసుపత్రిలో చేరింది. ఎన్నికల్లో వైసీపీకి పనిచేశాడని అక్కసుతో హత్యకు స్థానిక తెలుగుదేశం పార్టీ నాయకులు ఈ దారుణానికి ఒడిగట్టారని వైసీపీ ఆరోపించింది. ఈ హత్య ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. 11 మంది నిందితులను అరెస్ట్ చేశారు. హత్యకు ఉపయోగించిన కట్టెలు, మూడు కత్తులు, సెల్ ఫోన్లు, ఫార్చునర్ కారును స్వాధీనం చేసుకున్నారు. చంద్రబాబు ముఖ్యమంత్రి అయిన 50 రోజుల్లో ఏపీలో 36 రాజకీయ హత్యలు జరిగాయని వైఎస్ జగన్ ఆరోపించిన సంగతి తెలిసిందే.