
విజయవాడ: గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీతో వైసీపీ అధినేత జగన్ ములాఖత్ అయ్యారు. గన్నవరం టీడీపీ ఆఫీసుపై దాడి ఘటనలో ఫిర్యాదు చేసిన సత్యవర్ధన్ను కిడ్నాప్ చేసి బెదిరించిన కేసులో జైలులో ఉన్న వంశీని జగన్ పరామర్శించారు. వంశీతో ములాఖత్ అనంతరం జగన్ మీడియాతో మాట్లాడారు. వల్లభనేని వంశీ అరెస్ట్ను ఆయన ఖండించారు. గన్నవరం టీడీపీ ఆఫీస్ లో పనిచేస్తున్న సత్యవర్ధన్ జడ్జి ముందు ఇచ్చిన వాంగ్మూలం ఏంటి ? పోలీసులు పెట్టిన కేసు ఏంటని జగన్ ప్రశ్నించారు. వంశీ ఎలాంటి తప్పు చేయలేదని సత్యవర్ధనే చెప్పారని, వంశీని రెచ్చగొట్టేలా పట్టాభి నీచంగా మాట్లాడారని జగన్ చెప్పుకొచ్చారు.
చంద్రబాబు పట్టాభిని గన్నవరం పంపించారని, మరోసారి గన్నవరంలో పట్టాభి ప్రెస్ మీట్ లో వంశీని తిట్టారని చెప్పారు. అదే రోజు వైసీపీ కార్యాలయంపై దాడికి వెళ్లారని, పట్టాభి, అతని అనుచరులు కలిసి ఒక ఎస్సీ నేతపై దాడి చేశారని జగన్ తెలిపారు. అడ్డుకోబోయిన సీఐ కనకారావు తల కూడా పగలకొట్టారని, టీడీపీ దాడులను ప్రతిఘటించే సమయంలో ఈ ఘటన జరిగిందని చెప్పారు. ఇరు పార్టీలపై ఆరోజు పోలీసులు కేసు పెట్టారని, ఆరోజు టీడీపీ మూడు ఫిర్యాదులను స్వీకరించారని, ఆ ఫిర్యాదుల్లో ఎక్కడా కూడా వంశీ పేరు లేదని వైఎస్ జగన్ వ్యాఖ్యానించారు. వంశీ ఘటనలో లేడు కాబట్టే టీడీపీ ఆరోజు ఫిర్యాదు చేయలేదని చెప్పారు. ఏపీలో దిగజారిపోయిన లా అండ్ ఆర్డర్ కు వంశీ అరెస్ట్ ఘటన అద్ధం పడుతుందని వైసీపీ అధినేత జగన్ విమర్శించారు.
Also Read:-మహా శివరాత్రి సందర్భంగా ఆ ఆలయాలకు అదనపు బస్సులు..
వైసీపీ నేత, గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ ఇంట్లో ఏపీ పోలీసులు సోదాలు చేసిన సంగతి తెలిసిందే. హైదరాబాద్ రాయదుర్గం మై హోం భుజాలోని వంశీ ఇంట్లో తనిఖీలు నిర్వహించారు. పలు కీలక డాక్యుమెంట్లు, కంప్యూటర్ హార్డ్ డిస్కులను స్వాధీనం చేసుకొని విజయవాడకు తరలించారు. వంశీని విజయవాడ పడమట పోలీసులు అరెస్ట్ చేశారు. గన్నవరం టీడీపీ ఆఫీసుపై దాడి ఘటనలో ఫిర్యాదు చేసిన సత్యవర్ధన్ను కిడ్నాప్ చేసి బెదిరించినట్లు వంశీపై ఆరోపణలు ఉన్నాయి. దీంతో వంశీపై కిడ్నాప్, దాడి, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కింద కేసులు నమోదు చేశారు.