ఉద్యోగాలు లేవంటే హమాలీ పనులు చేసుకోవాలంటారా..?

ఉద్యోగాలు లేవంటే హమాలీ పనులు చేసుకోవాలంటారా..?
  • మంత్రి నిరంజన్ రెడ్డిపై వైఎస్ షర్మిల ఆగ్రహం

వనపర్తి జిల్లా: ఉద్యోగాలు లేవంటే హమాలీ పనులు చేసుకోవాలంటారా..?..మంత్రి పదవికి రాజీనామా చేసి హమాలీ పని చేసుకో.. అంటూ మంత్రి నిరంజన్ రెడ్డిపై వైఎస్ షర్మిల ఆగ్రహం వ్యక్తం చేశారు. మీరు మాత్రం రాజ్యాలు ఏలాలి.. డిగ్రీలు చదివినోళ్లు హమాలీ పనులు చేయాలా ? అని ఆమె నిలదీశారు. ప్రజా ప్రస్థానం పాదయాత్రలో భాగంగా షర్మిల ఇవాళ వనపర్తి జిల్లాలో పాదయాత్ర నిర్వహించారు. జనం కష్టాలు అడిగి తెలుసుకుంటూ.. ముందుకు సాగారు. జనం గుమిగూడిన చోట జనాన్ని ఉద్దేశించి క్లుప్తంగా ప్రసంగాలు చేశారు. 

పేదరికంతో వలసల జిల్లాగా పేరుపడిన జిల్లాను సస్యశ్యామలం చేసి.. శాశ్వతంగా వలసలు నివారించేందుకు పాలమూరు రంగారెడ్డి, డిండి పథకాలను తన తండ్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో చేపడితే.. 8 ఏళ్లుగా నిర్లక్ష్యం చేసి జనాన్ని సమస్యలపాలు చేశారని షర్మిల మండిపడ్డారు. ఉద్యోగాలు లేవంటే ఏదైనా హమాలీ పని  చేసుకుని బతకాలంటున్న మంత్రి నిరంజన్ రెడ్డి ముందు తన మంత్రి పదవికి రాజీనామా చేసి హమాలీ పని చేసుకోవాలని సూచించారు.

మీరు మాత్రం రాజ్యాలు ఏలాలి.. డిగ్రీలు పీజీలు చదివిన పిల్లలు హమాలీగా పని చేయాలా? అని షర్మిల  ప్రశ్నించారు.  రైతుల ప్రాణాలంటే కూడా మంత్రికి లెక్కే లేదు..అందుకే సినిమా టిక్కెట్లతో పోల్చారని విమర్శించారు. వనపర్తి జిల్లా కొత్తపల్లిలో పర్యటించిన సందర్భంగా గ్రామస్తులతో కాసేపు మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.