యాదాద్రిపై ఉన్న ప్రేమ.. వేములవాడపై ఏది?

యాదాద్రిపై ఉన్న ప్రేమ.. వేములవాడపై ఏది?
  • సూరమ్మ ప్రాజెక్టు, మిడ్ మానేరు బాధితులకు పరిహారం ఏమైంది?  
  • చెన్నమనేని రమేశ్​ జర్మనీకి ఎమ్మెల్యే
  • వైఎస్సార్​ టీపీ చీఫ్​ షర్మిల ​ఫైర్​
     

కోరుట్ల, వెలుగు: కేసీఆర్​కు యాదాద్రిపై ఉన్న ప్రేమ వేములవాడపై లేదని, ఏటా రూ.100 కోట్లు ఇస్తానని పైసా ఇవ్వకుండా రాజన్నకే శఠగోపం పెట్టాడని వైఎస్సార్​ టీపీ చీఫ్​ షర్మిల విమర్శించారు. యాదాద్రికి రూ. 3 వేల కోట్లు ఖర్చు పెట్టిన సీఎం.. రాజన్నకు కనీసం రూ.200 కోట్లు ఇవ్వడానికి చేతులు రాలేదన్నారు. ప్రజా ప్రస్థానం పాదయాత్రలో భాగంగా సోమవారం జగిత్యాల జిల్లా కథలాపూర్​లో నిర్వహించిన బహిరంగ సభలో షర్మిల మాట్లాడారు. రియల్ ఎస్టేట్ పెంచడం కోసమే కేసీఆర్ యాదాద్రిలో   డబ్బులు ఖర్చు చేస్తున్నాడన్నారు. చెన్నమనేని రమేశ్ వేములవాడకు ఎమ్మెల్యే కాదని.. జర్మనీకి ఎమ్మెల్యే అని ఎద్దేవా చేశారు.  వేములవాడకు వైఎస్​ చాలా చేశారని, ఎల్లంపల్లి రిజర్వాయర్ ద్వారా 50 వేల ఎకరాలకు నీరిచ్చారని తెలిపారు. కథలాపూర్, మేడిపల్లి మండలానికి సూరమ్మ ప్రాజెక్టు ద్వారా 40 వేల ఎకరాలకు సాగునీరు ఇద్దామనుకున్నారని, బతికి ఉంటే కచ్చితంగా ఇచ్చేవారన్నారు. కేసీఆర్​ ఇప్పటికి ఆ ప్రాజెక్టును పూర్తి చేయలేదన్నారు. ఎన్నికలకు ముందు మంత్రి హరీశ్​రావు వచ్చి శంకుస్థాపన చేసి వెళ్లారని, రూ.500 కోట్లు ఇచ్చామని చెప్పుకుంటున్నారని, అవి ఎక్కడకు పోయాయో తెలియదన్నారు. మిడ్ మానేరు కింద 12 గ్రామాల ప్రజలకు కేసీఆర్​ అన్యాయం చేశారని, రైతులకు నష్టపరిహారం ఏమైందని ప్రశ్నించారు. మిడ్ మానేరు బాధితులకు డబుల్ బెడ్ రూమ్​ ఇండ్లు ఇస్తానని సీఎం మోసం చేశాడన్నారు. పాదయాత్ర 2,900 కిలో మీటర్ల మైలు రాయి దాటిన సందర్భంగా కథలాపూర్ మండలం బొమ్మెనలో వైఎస్సార్​ విగ్రహాన్ని షర్మిల ఆవిష్కరించారు. అనంతరం మేడిపల్లి మండలం భీమారంలో  షర్మిల మాట ముచ్చట నిర్వహించారు. ఆమె మాట్లాడుతుండగా కొందరు టీఆకర్ఎస్ కార్యకర్తలు ప్రోగ్రాంను అడ్డుకునేందుకు ప్రయత్నించారు. దీంతో షర్మిల ఆగ్రహం వ్యక్తంచేశారు.