నిర్మల్ జిల్లా: తెలంగాణ రాష్ట్రంలో అప్పులేని రైతు లేడని వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ చీఫ్ షర్మిల అన్నారు. రుణమాఫీ అని కేసీర్ రైతులను నిలువునా మోసం చేశారని ఆమె మండిపడ్డారు. షర్మిల చేపట్టిన ప్రజా ప్రస్థానం పాదయాత్ర 187వ రోజుకు చేరుకుంది. ఇవాళ ఆదివారం ముధోల్, నిర్మల్ నియోజకవర్గాల్లో షర్మిల పాదయాత్ర చేస్తున్నారు.
నిర్మల్ జిల్లాలో రెండో రోజుకు పాదయాత్రను భైంసా మండలం మాటేగావ్ నుంచి ప్రారంభించారు. ముందుగా వానల్ పాడ్ లో వైఎస్ఆర్ విగ్రహానికి పూల మాల వేసి నివాళులు అర్పించారు. ఇవాళ నర్సాపూర్ జి గుండంపల్లి క్రాస్ రోడ్డు వరకు షర్మిల పాదయాత్ర చేయనున్నారు.
దారి పొడవునా ప్రజలను పలుకరిస్తూ.. ధైర్యం చెబుతూ.. వడి వడిగా ముందుకు సాగుతున్న షర్మిల
పాదయాత్రలో దారిపొడవునా ప్రజలను పలుకరిస్తూ.. యోగ క్షేమాలు.. సమస్యలు అడిగి తెలుసుకుంటూ ముందుకు సాగుతున్నారు షర్మిల. కూడలి ప్రాంతాల్లో ప్రజలనుద్దేశించి మాట్లాడారు. పోరాడి సాధించుకున్న తెలంగాణ అప్పుల కుప్పగా మారిందని ఆందోళన వ్యక్తం చేశారు. నిధులు.. నీళ్లు.. నియామకాల కోసం అంటూ సాధించుకున్న తెలంగాణలో నియంత పాలన సాగుతోందన్నారు. ఉద్యోగాలు లేక నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకుంటున్నా సీఎం కేసీఆర్ లో ఏ మాత్రం చలనం కనిపించడం లేదన్నారు.