కవిత అరెస్టు తప్పదనే కేసీఆర్ కొత్త డ్రామా
తిమ్మాపూర్(మానకొండూరు), వెలుగు : ‘‘కవితను బీజేపీ కొనాలని చూసింది. అయినా అమ్ముడుపోలేదు. అందుకే లిక్కర్ స్కామ్ కేసు పెట్టారు” అని సీఎం కేసీఆర్ కొత్త నాటకం మొదలుపెట్టారని వైఎస్సార్ టీపీ చీఫ్ షర్మిల మండిపడ్డారు. ఇన్ని రోజులు చేసిన ప్రయత్నాలు ఫలించలేదని, ఇక తన బిడ్డ అరెస్టు తప్పదనే ఈ కొత్త డ్రామాను తెరమీదకు తెచ్చారని ఫైర్ అయ్యారు. బుధవారం మానకొండూరు నియోజకవర్గంలోని తిమ్మాపూర్, మానకొండూరు మండలాల్లో షర్మిల పాదయాత్ర చేశారు. మానకొండూరులో బహిరంగ సభలో మాట్లాడారు.
‘‘మొన్న నలుగురు ఎమ్మెల్యేలతో నాలుగు స్తంభాలాట సినిమాను కేసీఆర్ రిలీజ్ చేశారు. నిన్న కంటే కూతురునే కనాలి అనే కొత్త సినిమా ట్రైలర్ విడుదల చేశారు” అని ఆమె విమర్శించారు. నలుగురు ఎమ్మెల్యేల విషయంలో కన్నీళ్లు పెట్టుకున్నపుడే, కవిత విషయం ఎందుకు బయటపెట్టలేదని ప్రశ్నించారు. ‘‘కవితను బీజేపీ కొనాలనుకోవడం నిజం కాదు. కేసీఆర్‌కు సోయి ఉండే మాట్లాడుతుండా? ప్రజలకు ఏం చెప్పిన నమ్ముతారని అనుకుంటుండు. కవితకు ఏం తక్కువని బీజేపీకి అమ్ముడుపోతది” అని అన్నారు.
రసమయికి వందల కోట్లు ఎక్కడివి?
‘‘ఒకప్పుడు అకౌంట్లో రూ.లక్ష లేని ఎమ్మెల్యే రసమయి బాలకిషన్‌కు వందల కోట్లు ఎలా వచ్చాయి? పాటలతో కోట్లు ఎలా సంపాదిస్తున్నాడు? ఉద్యమ సమయంలో అవే పాటలు పాడితే అప్పుడు ఎందుకు సంపాదన లేదు? ఎమ్మెల్యే అయ్యాకే పదవి అడ్డు పెట్టుకొని కోట్లు సంపాదించాడు?” అని షర్మిల ఆరోపించారు. ‘‘కేసీఆర్‌ను రసమయి ఫాలో అవుతున్నాడు. కేసీఆర్ లెక్క100 ఎకరాల్లో ఫాంహౌస్ కట్టుకున్నడట.
కేసీఆర్ కాళేశ్వరం నీళ్లు ఎత్తుకపోతే, ఈయన మిడ్ మానేరు నీళ్లు ఎత్తుకుపోతున్నడట. ఫామ్ హౌస్‌కు ఒక కాలువ తవ్వించుకున్నడట. యథా లీడర్.. తథా క్యాడర్’’ అని విమర్శించారు. రసమయి ఎక్కడపడితే అక్కడ కబ్జాలు చేస్తున్నారని.. రైస్ మిల్లులు, ప్రాజెక్టులు, ఆఖరికి సీఎం రిలీఫ్ ఫండ్ లోనూ కమీషన్లు తీసుకుంటున్నారని ఆరోపించారు.