-
సీఎం తీరు చూసి జనం నవ్వుకుంటున్నరు: షర్మిల
-
ఎమ్మెల్యే బాల్క సుమన్ బానిస సుమన్గా మారిండు
బెల్లంపల్లి రూరల్/జైపూర్, వెలుగు : సీఎం కేసీఆర్ రాష్ట్రాన్ని గాలికొదిలి దేశాన్ని ఉద్ధరిస్తానంటూ బయల్దేరడం హాస్యాస్పదంగా ఉందని వైఎస్ఆర్టీపీ చీఫ్ షర్మిల అన్నారు. బీఆర్ఎస్ అంటే భారత రాష్ర్ట సమితి కాదని, బందిపోట్ల రాష్ర్ట సమితి అంటే సరిగ్గా సూటవుతుందని విమర్శించారు. మంగళవారం మంచిర్యాల జిల్లా నెన్నెల, భీమారం మండలాల్లో ఆమె పాదయాత్ర కొనసాగింది. ఆవుడంలో మొదలైన యాత్ర గంగారం, చిన్న వెంకటాపూర్, కాజీపల్లి, నర్సింగాపూర్, బూరుగుపల్లి, పోతనపల్లి, కొత్తగూడెం, భీమారం, పోలంపల్లి గ్రామాల మీదుగా సాగింది. భీమారంలో జరిగిన బహిరంగ సభలో షర్మిల మాట్లాడారు. బంగారు తెలంగాణ పేరుతో సీఎం కేసీఆర్ తన కుటుంబాన్ని బంగారం చేసుకున్నారని, ఎన్నికల్లో గెలవడానికి హామీలిచ్చి మోసం చేయడం ఆయనకు అలవాటుగా మారిందని విమర్శించారు. దివంగత సీఎం వైఎస్సార్.. ప్రాణహిత–చేవెళ్ల ప్రాజెక్టు ద్వారా చెన్నూరు నియోజకవర్గంలో లక్ష ఎకరాలకు సాగునీరు ఇవ్వాలనుకున్నారని, అయితే కేసీఆర్ కాళేశ్వరం కట్టి ఈ ప్రాంత రైతులకు తీరని అన్యాయం చేశారని మండిపడ్డారు.
‘‘సింగరేణిలో ఓపెన్ కాస్టులు, కాంట్రాక్ట్ ఉద్యోగాలు ఉండవని చెప్పి దగా చేసిండు. గొల్లవాగు ప్రాజెక్ట్ ద్వారా 50 వేల ఎకరాలకు నీళ్లు ఇవ్వాలని వైఎస్సార్ అనుకుంటే కేసీఆర్ ప్రభుత్వం కాల్వలు కూడా తవ్వలేదు. చెన్నూర్ రెవెన్యూ డివిజన్, బస్ డిపో, మందమర్రి మున్సిపల్ ఎన్నికల హామీలు మర్చిపోయిండు. కేసీఆర్ను మరోసారి గెలిపిస్తే రాష్ర్టాన్ని కుక్కలు చింపిన విస్తరి చేస్తడు. ఇక చెన్నూరు ఎమ్మెల్యే బాల్క సుమన్ బానిస సుమన్గా మారిండు. తొండ ముదిరి ఊసరవెల్లి అయినట్లు స్టూడెంట్ లీడర్ కాస్త రౌడీ ఎమ్మెల్యే అయ్యాడు. పెద్దపల్లి ఎంపీగా పోటీ చేసినప్పుడు రూ.వంద కూడా లేవని చెప్పిన నీకు (సుమన్) ఇప్పుడు వందల కోట్లు ఎట్ల వచ్చాయి?” అని షర్మిల ప్రశ్నించారు. ల్యాండ్ మాఫియా, సాండ్ మాఫియా సుమన్ కనుసన్నల్లోనే నడుస్తోందని ఆరోపించారు. ఉద్యమ సమయంలో ఎంతో మంది విద్యార్థులను, నిరుద్యోగులను రెచ్చగొట్టి వారి ఆత్మహత్యలకు సుమన్ కారకుడయ్యాడని అన్నారు. ఈ సెగ్మెంట్లో నిరుద్యోగి మహేశ్ ఆత్మహత్య చేసుకుంటే ఆయన కుటుంబాన్ని పరామర్శించలేదన్నారు.