నిరుద్యోగ నిరాహార దీక్షలో షర్మిల
నిజాంసాగర్(ఎల్లారెడ్డి), వెలుగు : నమ్మకంతో అధికారం అప్పగిస్తే కేసీఆర్రాష్ట్రంలో ప్రతి వర్గాన్ని మోసం చేశారని వైఎస్ఆర్ టీపీ చీఫ్ షర్మిల మండిపడ్డారు. తన పిల్లలకు, చుట్టాలకు పదవులు ఇచ్చుకున్న కేసీఆర్ నిరుద్యోగులను మాత్రం కూలీ, హమాలీ పనులు చేసుకోవాలంటున్నారని విమర్శించారు. మంగళవారం ఎల్లారెడ్డి నుంచి హాసన్ పల్లి, బొగ్గుగుడెసె, నిజాంసాగర్ మీదుగా ప్రజా సంగ్రామ పాదయాత్ర సాగింది. నిజాంసాగర్ లో షర్మిల నిరుద్యోగ నిరాహార దీక్ష చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ నిరుద్యోగుల సమస్యల పరిష్కరం కోసం కాంగ్రెస్, బీజేపీ లీడర్లు ఒక్కరోజు కూడా నిరసన, సమ్మె చేయకపోవడం సిగ్గుచేటన్నారు.
రాబోయే రోజుల్లో ఆ పార్టీలు పతనమవడం ఖాయమని అన్నారు. రాష్ట్రంలో 54 లక్షల మంది ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్నారని తెలిపారు. కేసీఆర్ తన కుటుంబ ఆస్తులు పెంచుకోవడమే తప్ప వారి గోడు పట్టించుకోవడం లేదన్నారు. వెంటనే ఉద్యోగాల భర్తీ చేపట్టాలని డిమాండ్ చేశారు. ఉద్యోగాలు లేక యువత పడుతున్న కష్టాలు వెలుగులోకి తెచ్చేందుకు 36 వారాలుగా ప్రతి మంగళవారం నిరుద్యోగ నిరాహార దీక్ష చేపడుతున్నట్లు తెలిపారు. తర్వాత ప్రారంభమైన పాదయాత్ర మంగుళూరు, మాగి, గోర్గాల్ మీదుగా కొనసాగింది.