చొప్పదండి/ధర్మారం, వెలుగు: సిరిసిల్ల, గజ్వేల్ మాదిరిగా చొప్పదండి నియోజకవర్గాన్ని ఎందుకు అభివృద్ధి చేయలేదని వైఎస్సార్ టీపీ చీఫ్ షర్మిల ప్రశ్నించారు. ప్రజా ప్రస్థానం పాదయాత్ర సోమవారం చొప్పదండికి చేరుకోగా.. ఆర్నకొండ గ్రామం వద్ద వైఎస్సార్ విగ్రహాన్ని షర్మిల ఆవిష్కరించారు. అనంతరం చొప్పదండి టౌన్లో జరిగిన సభలో మాట్లాడారు. సీఎం కేసీఆర్ భార్య సొంతూరు మిడ్ మానేరు ముంపు కింద పోయి, బాధితులు ఇబ్బందులు పడుతుంటే పరిహారం ఇవ్వలేదని మండిపడ్డారు. అత్తగారి ఊరును పట్టించుకోనోళ్లు రాష్ట్రాన్ని ఎలా పట్టించుకుంటారని ఎద్దేవా చేశారు. ఎన్నికల ముందు చొప్పదండిని గజ్వేల్, సిరిసిల్ల మాదిరిగా చేస్తనని చెప్పి, ఏమీ చేయలేదన్నారు.
చొప్పదండికి అల్లుడు కేసీఅర్, మనవడు మంత్రి కేటీఆర్, ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ ముగ్గురున్నా ఆదుకునే దిక్కులేకుండా పోయిందన్నారు. తెలంగాణ ప్రజలను మోసం చేసిన 420 కేసీఆర్ అని ఆరోపించారు. అప్పుల పాలైన అని చెప్పిన రవిశంకర్‌కు మూడేండ్లలో వందల కోట్లు ఎట్లొచ్చినయని ప్రశ్నించారు. ఎమ్మెల్యేకు కమీషన్ రాజా అనే పేరుందని, కమీషన్ లేనిదే పనిచేయరని ఆరోపించారు. మున్సిపల్ చైర్మన్ పదవికి రూ.90 లక్షలు, మార్కెటింగ్ చైర్మన్‌కు రూ.30 లక్షలు, ఎస్సై పోస్ట్‌కి రూ.15 లక్షలు, సీఐ ప్రమోషన్‌కు రూ.25 లక్షలు, సెంట్రల్ లైటింగ్ ప్రాజెక్టుకు రూ.కోట్లు కమీషన్లు.. ఇలా కమీషన్ ఇస్తే ఎమ్మెల్యే గడ్డి కూడా తింటారని ఫైర్ అయ్యారు.
కొండగట్టు అంజన్నను కూడా కేసీఆర్ వదల్లే
కాళేశ్వరం ప్రాజెక్టుతో చొప్పదండికి నీళ్ళు ఇచ్చాకే మిగతా ప్రాంతాలకని చెప్పి.. ఇక్కడి నీళ్లను ఫామ్ హౌస్‌కు పట్టుకుపోయారని షర్మిల మండిపడ్డారు. మిడ్ మానేరు కింద మునిగిన 5 గ్రామాల్లో ఒక్కో కుటుంబానికి రూ.5 లక్షలిస్తానని చెప్పి, సీఎం సారీ చెప్పారన్నారు. సిరిసిల్లలో చేనేతలకు ఒక న్యాయం, చొప్పదండి చేనేతలకు ఒక న్యాయమా అని ప్రశ్నించారు? కొండగట్టు అభివృద్ధికి 100 కోట్లిస్తామని.. దేవుడిని కూడా సీఎం కేసీఆర్ మోసం చేశాడని షర్మిల అన్నారు. అధికారంలోకి రాగానే టీఆర్ఎస్ నాయకులు మృగాలుగా మారారని, తమ కార్యకర్తలపై దాడులతో పాదయాత్రను అడ్డుకోవాలని చూస్తున్నారని షర్మిల పెద్దపల్లి జిల్లా కటికెనపెల్లిలో జరిగిన మీడియా సమావేశంలో అన్నారు.