రాష్ట్రంలో తాము అధికారంలోకి వస్తే వృద్ధులకు రూ.3వేలకు తగ్గకుండా పింఛన్లు ఇస్తమని వైఎస్సార్ టీపీ అధ్యక్షురాలు షర్మిల ప్రకటించారు. ముఖ్యమంత్రి అంటే కేసీఆర్ లా మదమెక్కి ఉండకూడదని.. వైఎస్ రాజశేఖర్ రెడ్డి వంటి మనసున్న మారాజులా ఉండాలన్నారు. 77 రోజులుగా వీఆర్ఏలు సమ్మె చేస్తున్నా కేసీఆర్ కు కనికరం లేదన్నారు. అధికార మదం నెత్తికెక్కి వీఆర్ఏల వినతి పత్రాన్ని కేసీఆర్ విసిరికొట్టారని కామెంట్ చేశారు. అందుకే రాష్ట్రంలో అధికారం మారాల్సిన అవసరం ఉందన్నారు. 175వ రోజు ప్రజాప్రస్థానం పాదయాత్ర ఎల్లారెడ్డి నియోజకవర్గం లింగంపేట్ మండలానికి చేరుకుంది. ఈసందర్భంగా షర్మిల ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు.
ఎల్లారెడ్డి నియోజకవర్గ ఎమ్మెల్యేపై ఆమె విరుచుకుపడ్డారు. ‘‘ టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి గెలవకూడదనే కసితో చందాలు వేసుకొని మరీ ప్రజలు మరో పార్టీ నుంచి ఈ ఎమ్మె్ల్యేను గెలిపించారు. అయితే గెలిచాక అతడు నమ్మకద్రోహం చేశాడు. ప్రజలకు వెన్నుపోటు పొడిచాడు. డబ్బుకు ఆశపడి మళ్లీ టీఆర్ఎస్ పార్టీకే పశువులా అమ్ముడుపోయాడు’’ అని షర్మిల మండిపడ్డారు. అభివృద్ధి కోసమే జంప్ అవుతున్న అని చెప్పిన స్థానిక ఎమ్మెల్యే.. కనీసం సొంత గ్రామంలో పోడు భూములను ఫారెస్టు అధికారులు లాక్కుంటుంటే ఏమీ చేయలేకపోయారని ఆరోపించారు.