దేశ రాజకీయాలకు కేసీఆర్ అనర్హుడని, తెలంగాణాలో ఇంతమంది ఆత్మహత్యలకు కారకుడైన కేసీఆర్ ఇప్పుడు దేశాన్ని బంగారం చేస్తానంటే నమ్మేదెలా అంటూ ప్రశ్నించారు వైఎస్సార్ టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిళ. లోటస్ పాండ్ లోని పార్టీ కార్యాలయంలో ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో మాట్లాడిన షర్మిల.. ఏజ్ లిమిట్ లేకుండా రైతు బతికి ఉన్నంతకాలం రైతు భీమా ఇవ్వాల్సిందే అంటూ కేసీఆర్ ను డిమాండ్ చేశారు. రైతు భీమా వయసును సవరించకుంటే న్యాయపోరాటం చేస్తానన్నారు.
కోర్టులు మొట్టికాయలు వేస్తేనే కేసీఆర్ పనిచేస్తాడని, కోర్టుల భాషనే కేసీఆర్ కు అర్థమౌతుందని, అందుకే రైతు భీమా విషయంలో కోర్టునే ఆశ్రయించామన్నారు షర్మిల. రైతులను ఆదుకుంటున్నామన్న పేరుతో బోడి 5 వేలు ఇస్తూ బిల్డప్ ఇస్తున్నారంటూ ఎద్దేవా చేశారు షర్మిల. రైతు బంధు పేరుతో 5 వేలు ఇస్తూ, సబ్సిడీ లన్ని ఎత్తేసి 25 వేలు పట్టుకుంటున్నారని షర్మిల తెలిపారు. ఎల్ఐసి ఒప్పుకోకపోతే, పక్క రాష్ట్రాలు ఇస్తున్నట్లు ప్రభుత్వమే చనిపోయిన రైతుల కుటుంబాలకు 25 లక్షల రూపాయలు అందించాలని షర్మిల డిమాండ్ చేసారు. ప్రజలు ఓట్లు వేసింది ఎల్ఐసికి కాదని, మంచి చేస్తాడనే నమ్మకంతోనే కేసీఆర్ కు ఓట్లేశారని షర్మిల గుర్తుచేశారు. రాష్ట్రంలో కౌలు రైతుల పరిస్థితి మరీ దారుణంగా ఉందని, కౌలు రైతులు రైతులే కాదన్నట్లు కేసీఆర్ మాట్లాడటం దుర్మార్గమన్నారు. కౌలు రైతులను గుర్తించి, వారికీ రైతు బంధు, రైతు భీమా వర్తింపజేయాలని డిమాండ్ చేశారు షర్మిల.
కేసీఆర్ కు గలీజ్ తిట్లే వచ్చనుకున్ననని, బంగారు భారతదేశం అంటూ జోకులు కూడా బానే వేస్తారని ఎద్దేవా చేశారు షర్మిల. తెలంగాణాలో మొత్తం ఉద్దరించేసినట్లు ఇప్పుడు వెళ్లి దేశాన్ని ఉద్ధరిస్తారంట అంటూ కేసీఆర్ జాతీయ రాజకీయాలపై స్పందించారు షర్మిల. రైతుకు నచ్చిన పంట కూడా వేసుకునే స్వేచ్ఛ కేసీఆర్ పాలనలో లేకుండా పోయిందన్నారు . బంగారు తెలంగాణ ఎక్కడుందని ప్రశ్నించిన షర్మిల.. మద్యం అమ్మకపోతే నడవలేని స్థితిలో రాష్ట్రం ఉందన్నారు. ఒక్కరిపై కేసీఆర్ నాలుగు లక్షల అప్పు మోపుచేశాడంటూ షర్మిల ఆగ్రహం వ్యక్తం చేశారు.
కేసీఆర్ పాలనలో అవినీతి అన్నిచోట్లా ఉందని, ఒక్క కాళేశ్వరం ప్రాజెక్టునే లక్ష 30 వేల కోట్ల వ్యయంతో నిర్మించి నీళ్లు ఎత్తిపోసి సముద్రంలో పోస్తున్నారని, వేల కోట్ల కరెంట్ బిల్లులు కడుతున్నారని తెలిపారు షర్మిల. కాళేశ్వరం కమీషన్లతో కేసీఆర్ కుటుంబానికే బంగారు తెలంగాణ అయింది తప్ప సామాన్యులెవరికి మేలు జరగలేదన్నారు . కమీషన్లతో కేసీఆర్ కుటుంబం ఒక్కటి బాగుపడితే తెలంగాణ మొత్తం బాగుపడ్డట్లు కాదని, కేసీఆర్ తెలంగాణను బంగారు తెలంగాణగా కాదు, ఆత్మహత్యలు, అప్పుల తెలంగాణగా మార్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు షర్మిల. ఒకప్పుడు స్కూటర్ మీద తిరిగిన కేసీఆర్ ఇప్పుడెలా ఉన్నారంటూ ప్రశ్నించారు షర్మిల.