రేవంత్ పిలక కేసీఆర్ చేతిలో ఉంది : షర్మిల

పాదయాత్ర అనే పేరును రేవంత్ రెడ్డి భ్రష్టు పట్టిస్తున్నారని వైఎస్సార్టీపీ చీఫ్ షర్మిల విమర్శించారు. రేవంత్ రెడ్డి పాదయాత్ర చేస్తున్నడో.. దొంగ యాత్ర చేస్తున్నాడో అర్థం కావడం లేదన్నారు. ఆయన పాదయాత్రపై సొంత పార్టీ నేతలే పెదవి విరుస్తున్నారని ఆరోపించారు. రేవంత్ ఓటుకు నోటు కేసులో దొరికిన దొంగ అని.. ఆయన పిలక కేసీఅర్ చేతిలో ఉందన్నారు. ప్రజా ప్రస్థానం పాదయాత్రలో భాగంగా జనగాం బస్టాండ్ వద్ద నిర్వహించిన బహిరంగ సభలో ఆమె ప్రసంగించారు. జలయజ్ఞం ద్వారా వైఎస్సార్  రాష్ట్రంలో 33 ప్రాజెక్టులకు శ్రీకారంచుట్టారన్నారు. ఎస్సారెస్పీ, ఎల్లంపల్లి, దేవాదుల, ప్రాణహిత - చేవెళ్ల, దుమ్ముగూడెం, కల్వకుర్తి, భీమా, నెట్టెంపాడు ఇలా ఎన్నో ప్రాజెక్టులను చేపట్టారన్నారు. వైఎస్సార్ ఉన్నప్పుడే ప్రాజెక్టులకు సంబంధించిన 80 శాతం పనులు పూర్తయ్యాయన్నారు. ఇప్పుడు మిగిలిన 20 శాతం పనులను కేసీఅర్ పూర్తి చేయడం లేదని చెప్పారు. కాళేశ్వరం ప్రాజెక్టుతో ఎన్ని ఎకరాలకు నీళ్లిచ్చారని ప్రశ్నించారు. వైఎస్సార్ కు కేసీఆర్ కు నక్కకు నాగలోకానికి ఉన్నంత తేడా ఉందన్నారు.