మంచిర్యాల జిల్లా: ఒక్క హామీని కూడా నిలబెట్టుకోని సీఎం తెలంగాణకు అవసరమా అని వైఎస్ఆర్టీపీ అధ్యక్షురాలు షర్మిల కేసీఆర్ పై మండిపడ్డారు. ప్రజా ప్రస్థానం యాత్రలో భాగంగా షర్మిల మంచిర్యాల జిల్లాలో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. ప్రజలకు ఇచ్చిన ఏ ఒక్క హామీని కూడా సీఎం కేసీఆర్ నెరవేర్చలేదని మండిపడ్డారు. మంచిర్యాల జిల్లాలో వైఎస్ఆర్ చేపట్టిన తమ్మిడిహట్టి, వార్దా ప్రాజెక్టులను కావాలనే కేసీఆర్ పూర్తి చేయలేదని విమర్శించారు. ఆ ప్రాజెక్టులు పూర్తి చేసుంటే లక్షల ఎకరాల్లో సాగునీరు అంది రైతులు బాగుపడేవారి అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ ను రీడిజైన్ చేసి జిల్లాకు తీరని అన్యాయం చేశారని ఆరోపించారు.
సింగరేణిలో ఓపెన్ కాస్ట్ బంద్ చేసి అండర్ గ్రౌండ్ బొగ్గు బావులు తవ్వుతామని ఇచ్చిన మాటను కేసీఆర్ తప్పారని ఫైర్ అయ్యారు. సింగరేణి కార్మికులకు వైఎస్ఆర్ ఇళ్ల పట్టాలు ఇచ్చారని, రూ.10 లక్షలతో ఇళ్లు కట్టిస్తానన్న సీఎం కేసీఆర్ ఇప్పుడు వాటి ఊసే ఎత్తడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. పోడు భూములకు పట్టాలడిగితే మహిళలు అని కూడా చూడకుండా జైల్లో పెట్టారని మండిపడ్డారు. ఆనాడు సీఎంగా ఉన్న వైఎస్ఆర్ ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాకు పెద్దపీట వేశారని చెప్పారు. ఎల్లంపల్లి ప్రాజెక్ట్ ద్వారా 2 లక్షల ఎకరాలకు సాగు నీరు అందించారని గుర్తు చేశారు. తమ పార్టీని ఆదరిస్తే వైఎస్ఆర్ సంక్షేమ పాలనను తిరిగి తీసుకొస్తామని షర్మిల స్పష్టం చేశారు.