హైదరాబాద్: రిటర్నింగ్ ఆఫీసర్ టీఆర్ఎస్ కు అమ్ముడుపోయారని మునుగోడు ఉప ఎన్నికలో పోటీ చేస్తున్న యుగతులసి పార్టీ అభ్యర్థి కె.శివకుమార్ ఆరోపించారు. తనకు ముందుగా కేటాయించిన రోడ్ రోలర్ గుర్తును తొలగించి బేబీ వాకర్ గుర్తును కేటాయించడం పట్ల శివకుమార్ ఈసీపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తనకు మొదట రోడ్ రోలర్ గుర్తించారని, ఈ విషయాన్ని తనకు పబ్లిక్ గా ఈసీ అధికారులు తెలియజేశారని పేర్కొన్నారు. యుగ తులసి పార్టీకి రోడ్ రోలర్ గుర్తును కేటాయించినట్లు తన నుంచి సంతకం కూడా తీసుకున్నారని ఆయన చెప్పారు. అయితే తమ గుర్తు కారు గుర్తును పోలి ఉండటంతో టీఆర్ఎస్ పార్టీ ఈసీతో కుమ్మక్కై తనకు వేరే గుర్తు వచ్చేలా కుట్రలు పన్నిందని మండిపడ్డారు.
అంతకు ముందు టీఆర్ఎస్ ఎమ్మెల్యే దానం నాగేందర్ తనను కలిసి సింబల్ మార్చుకోవాలని కోరారని, అయితే తాను అందుకు ఒప్పుకోలేదని తెలిపారు. ఈ నేపథ్యంలోనే టీఆర్ఎస్ నాయకులు తనకు రోడ్ రోలర్ సింబల్ లేకుండా చేశారని ఆరోపించారు. తనకు జరిగిన అన్యాయంపై హైకోర్టులో కేసు వేశానని, కేంద్ర ఎన్నికల సంఘానికి కూడా ఫిర్యాదు చేశానని చెప్పారు. తన గుర్తు తనకు వచ్చే వరకు పోరాటం చేస్తానన్న శివకుమార్.. అవసరమైతే సుప్రీంకోర్టుకు వెళ్తానని స్పష్టం చేశారు.