ఏఎస్‌‌బీ క్లాసిక్‌‌ టెన్నిస్‌‌ టోర్నీ సెమీస్‌‌లో భాంబ్రీ జోడీ

న్యూఢిల్లీ : ఆక్లాండ్‌‌లో జరుగుతున్న ఏఎస్‌‌బీ క్లాసిక్‌‌ టెన్నిస్‌‌ టోర్నీలో.. ఇండియా స్టార్‌‌ ప్లేయర్‌‌ యూకీ భాంబ్రీ–అల్బనో ఒలీవెటీ (ఫ్రాన్స్‌‌) జోడీ సెమీస్‌‌లోకి ప్రవేశించింది. గురువారం జరిగిన మెన్స్‌‌ డబుల్స్‌‌ క్వార్టర్స్‌‌లో యూకీ–అల్బనో 3–6, 6–4, 12–10తో మూడోసీడ్‌‌ జులియన్‌‌ కాష్‌‌–లాయిడ్‌‌ గ్లాస్‌‌పూల్‌‌ (బ్రిటన్‌‌)పై గెలిచారు. గంటా 21 నిమిషాల పాటు జరిగిన ఈ మ్యాచ్‌‌లో ఇండో–ఫ్రాన్స్‌‌ ద్వయం తొలి సెట్‌‌లో ఓడినా తర్వాతి రెండు సెట్లలో అద్భుతంగా ఆడింది.

బలమైన ఏస్‌‌లు, సర్వీస్‌‌లతో ప్రత్యర్థులకు చెక్‌‌ పెట్టింది. మూడో సెట్‌‌ను సూపర్ టైబ్రేకర్‌‌లో సొంతం చేసుకుంది. సెమీస్‌‌లో భాంబ్రీ జోడి.. అన్‌‌సీడెడ్‌‌ అమెరికా జంట క్రిస్టియన్‌‌ హారిసన్‌‌–రాజీవ్‌‌ రామ్‌‌తో తలపడనుంది. క్వార్టర్స్‌‌లో హారిసన్‌‌–రాజీవ్‌‌ 7–5, 6–7 (4), 10–5తో సాడియో డౌంబియా–ఫ్యాబియెన్‌‌ రీబౌల్‌‌ (ఫ్రాన్స్‌‌)పై నెగ్గారు.