- దు:ఖాన్ని దిగమింగుతూ నావల్నీ భార్య ప్రసంగం
- భర్త పోరాటాన్ని కొనసాగిస్తానని వెల్లడి
- సోషల్ మీడియాలో వైరల్గా మారిన వీడియో
మాస్కో: ‘మూడు రోజుల క్రితం నా భర్త అలెక్సీ నావల్నీని పుతిన్ చంపేశాడు’.. ఉబికి వస్తున్న కన్నీటిని బలవంతంగా ఆపుకుంటూ నావల్నీ భార్య యూలియా నావల్నయా అతికష్టంగా పలికిన మాటలివి.. సోమవారం మ్యూనిచ్ సెక్యూరిటీ కాన్ఫరెన్స్ వేదికపై యూలియా ప్రసంగించారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మూడేళ్ల పాటు ఆర్కిటిక్ జైలులో శిక్ష అనుభవిస్తూ, చిత్రహింసలకు గురై, చివరకు మూడు రోజుల క్రితం ప్రాణాలు కోల్పోయాడని చెప్పారు. జైలులో వాకింగ్ వెళ్లినపుడు స్పృహ తప్పి పడిపోయాడని, చికిత్స అందించే లోపే మరణించాడని అధికారులు చెప్పారు. వారి మాటలు ఎంతవరకు నమ్మొచ్చో తెలియదు కానీ తన భర్తను చంపింది పుతినేనని యూలియా ఆరోపించారు.
నావల్నీ పోరాటం నేను కొనసాగిస్తా..
గడిచిన పదేళ్లుగా భర్త అడుగుజాడలలో నడుస్తున్నానని, ఇకపై ఆయన పోరాటాన్ని ఒంటరిగానే కొనసాగిస్తానని యూలియా స్పష్టం చేశారు. నావల్నీ ఆశయ సాధన కోసం పనిచేస్తానని తేల్చిచెప్పారు. నావల్నీ మద్దతుదారులంతా కలిసి రావాలన్నారు. నావల్నీని మట్టుబెట్టడం ద్వారా పోరాటాన్ని అణచివేయొచ్చనుకున్న వారి నమ్మకాన్ని వమ్ము చేద్దామని పిలుపునిచ్చారు. యుద్ధానికి, అవినీతికి, అన్యాయానికి, ఎన్నికల్లో పారదర్శకత కోసం, భావప్రకటన స్వేచ్ఛ కోసం పోరాడాలని, ఇందుకోసం దొరికిన ఏ చిన్న అవకాశాన్నీ వదులుకోవద్దని యూలియా పేర్కొన్నారు. తన భర్తను చంపించింది పుతినే అనడంలో ఎలాంటి సందేహం లేదని, అయితే అది ఎవరు చేశారు.. ఎలా చేశారనేది తొందర్లోనే బయటపెడతానని యూలియా ఈ సందర్భంగా ప్రతిజ్ఞ చేశారు.