
అతని అసలు పేరు యూసుఫ్ మడప్పెన్. కానీ.. అందరూ యూసుఫ్ భాయ్ అని పిలుస్తుంటారు. కేరళలోని త్రిస్సూర్ జిల్లా చావక్కాడ్‌లో పుట్టి పెరిగాడు. ప్రస్తుతం దుబాయ్‌లో స్థిరపడ్డాడు. కొన్నాళ్ల నుంచి రకరకాల కొత్త పర్ఫ్యూమ్స్ని అందిస్తూ.. సోషల్ మీడియాలో ఫేమస్ అయ్యాడు. భావోద్వేగాలను, జ్ఞాపకాలను, వ్యక్తిత్వాలను సీసాలో బంధించే అద్భుతమైన కళాకారుడిగా పేరు తెచ్చుకున్నాడు. 15 నిమిషాల్లోనే ఎలాంటి సువాసననైనా రీక్రియేట్ చేయగల ప్రతిభ అతని సొంతం. అందుకే ప్రపంచవ్యాప్తంగా ఎన్నో దేశాల నుంచి అతని దుకాణానికి వెళ్తున్నారు.
పర్‌ఫ్యూమ్ అంటే ఇష్టం
యూసుఫ్‌కి చిన్నప్పుడే పర్‌ఫ్యూమ్స్ మీద ఇష్టం మొదలైంది. అతని తండ్రి చేపల మార్కెట్లో పనిచేసేవాడు. చేపల వాసనని దాచడానికి రకరకాల పర్‌ఫ్యూమ్స్ వాడేవాడు. అప్పుడే యూసుఫ్‌కి కూడాపర్ఫ్యూమ్ వాడడం అలవాటు అయ్యింది. వాళ్ల ఇంటికి దగ్గర్లోని తోటల్లో పండిన మామిడి, పైనాపిల్, మల్లె పువ్వుల వాసనలను రోజూ ఆస్వాదించేవాడు. అప్పటినుంచే అతనికి నచ్చిన కొన్ని సువాసనలని రీక్రియేట్ చేయాలి అనుకునేవాడు. ఆ తర్వాత ఖతార్ వెళ్లి ఫొటోగ్రాఫర్‌గా సెటిల్ అయ్యాడు. యూసుఫ్ ఒకసారి దుబాయ్‌లో పర్‌ఫ్యూమ్ వ్యాపారం చేసే తన తమ్ముడి దగ్గరకు వెళ్లాడు. అతనికి మొదటి నుంచి పర్‌ఫ్యూమ్స్ మీద ఉన్న ఇష్టం వల్ల ఆ వ్యాపారంలో పార్ట్నర్గా చేరాడు.
కొత్తగా ఆలోచించి..
యూసుఫ్ వ్యాపారంలో చేరిన తర్వాత సువాసనలు రీక్రియేట్ చేయడం మొదలుపెట్టాడు. అంటే అతని దగ్గరికి ఏదైనా వస్తువుని తీసుకెళ్లి దాని నుంచి వచ్చే వాసనని రీక్రియేట్ చేసి అలాంటి సువాసనతో పర్‌ఫ్యూమ్ తయారుచేస్తుంటాడు. అంతేకాకుండా సొంతంగా కొన్ని పర్‌ఫ్యూమ్స్ కూడా క్రియేట్ చేశాడు. అతని పనితీరు నచ్చడంతో గిరాకీ బాగా పెరిగింది. దాంతో వ్యాపారం విస్తరించి యూఏఈలో మరో నాలుగు స్టోర్లు పెట్టారు.
సోషల్ మీడియాతో పాపులర్
యూసుఫ్ జీవితం ఒక సాధారణ పర్ఫ్యూమర్గా మొదలైనా కొన్నేండ్లలోనే చాలామందికి పరిచయమయ్యాడు. కానీ.. ఈ మధ్య సోషల్ మీడియాలోకి ఎంట్రీ ఇచ్చాక ప్రపంచవ్యాప్త ఖ్యాతిని సంపాదించాడు. అతన్ని సోషల్ మీడియాలో చాలామంది ‘‘పర్‌ఫ్యూమ్స్ డాక్టర్” అని పిలుస్తుంటారు. సరిగ్గా రెండు నెలల క్రితం(జనవరి 30) యూట్యూబ్ చానెల్ పెట్టాడు. ‘యూసుఫ్ భాయ్ పర్‌ఫ్యూమర్’ పేరుతో పెట్టిన అతని చానెల్‌ని రెండు నెలల్లోనే లక్షన్నర మందికి పైగా సబ్స్క్రయిబ్ చేసుకున్నారు. దాంతోపాటు ఆన్‌లైన్ ప్లాట్‌ఫామ్స్‌లో తన కథను పంచుకోవడంతో మిలియన్ల మంది హృదయాలను గెలుచుకున్నాడు. అతను పర్‌ఫ్యూమ్స్ తయారుచేస్తున్నప్పుడు తీసిన వీడియోలను రెగ్యులర్‌గా యూట్యూబ్‌లో అప్లోడ్ చేస్తుంటాడు. ఇప్పటివరకు యూసుఫ్ చేసినవన్నీ షార్ట్ వీడియోలే. జ్ఞాపకాలను పర్ఫ్యూమ్స్గా మార్చే విధానం నచ్చి చాలామంది ఫిదా అవుతున్నారు.
►ALSO READ | యాదిలో: ఆధునిక హైదరాబాద్ నిర్మాత.. సర్ అక్బర్ హైదరీ
అందుకే అతను చేసిన కొన్ని వీడియోలకు మిలియన్ కంటే ఎక్కువ వ్యూస్ వచ్చాయి. యూట్యూబ్‌లో వీడియోలు చేయడం మొదలుపెట్టినప్పటినుంచి వ్యాపారం బాగా పెరిగింది. “నేను యూట్యూబ్ ప్రయాణం కేవలం వ్యాపారం కోసం మొదలుపెట్టలేదు. కస్టమర్ కళ్లలో కన్నీళ్లు చూసినప్పుడు నేను ఒక మంచి పర్‌ఫ్యూమ్ తయారు చేశాననే నమ్మకం కలుగుతుంది. ఆ భావోద్వేగం చాలా గొప్పది. దాన్ని అందరితో పంచుకోవాలనే ఉద్దేశంతోనే యూట్యూబ్ చానెల్ పెట్టా” అంటూ తన యూట్యూబ్ ఎంట్రీకి గల కారణాన్ని పంచుకున్నాడు యూసుఫ్.
రోజుకు100 నుంచి 200
యూసుఫ్ ప్రస్తుతం రోజుకు 100 నుండి 200 కొత్త పర్ఫ్యూమ్స్ని తయారుచేస్తున్నాడు. ఒక్కోదానికి రూ. 2వేలకు పైగా తీసుకుంటాడు. కేవలం ఎమోషన్‌తోనే పర్‌ఫ్యూమ్ చేయించుకోవాలి అనుకునే కొంతమందికి ఫ్రీగా చేసిస్తాడు. ముఖ్యంగా తన దుకాణానికి వెళ్లే పిల్లలకు పర్ఫ్యూమ్స్ని గిఫ్ట్‌గా ఇస్తుంటాడు.
ప్రతిదీ ప్రత్యేకమే
‘‘ప్రతి వస్తువు, వ్యక్తికీ ఒక ప్రత్యేకమైన సువాసన ఉంటుంది’’ అంటాడు యూసుఫ్. అంతేకాదు ఒక వ్యక్తి నుంచి వచ్చే వాసన అతని చిరునవ్వు, వేసుకునే బట్టలు, ప్రవర్తనల మిశ్రమం అని బలంగా నమ్ముతాడు. అతన్ని మార్కెట్లో ప్రత్యేకంగా నిలబెట్టింది కూడా ఆ నమ్మకమే. వ్యక్తిగత జ్ఞాపకాల సువాసనలను తిరిగి సృష్టించడంలో యూసుఫ్ స్పెషలిస్ట్. అందుకే అతని దుకాణా నికి కస్టమర్లు క్యూ కడుతుంటారు. కొందరు వాళ్లకు ఇష్టమైన వ్యక్తుల బట్టలు తీసుకొచ్చి దానినుంచి వచ్చే సువాసనని రీక్రియేట్ చేయమని అడుగుతారు. కొందరు వాళ్ల పాత వస్తువులను తీసుకొస్తుంటారు. ఒక మహిళ కేవలం పర్‌ఫ్యూమ్ కోసమే మారిషస్ నుండి దుబాయ్‌కి వెళ్లింది.
ఒకప్పుడు రాజ కుటుంబీకులు తన తాతకు బహుమతిగా ఇచ్చిన పర్‌ఫ్యూమ్ సీసాని తీసుకెళ్లి యూసుఫ్‌కి ఇచ్చింది. కానీ.. అందులో పర్‌ఫ్యూమ్ లేదు. దాని నుంచి వచ్చే వాసనతో సరిగ్గా అలాంటి పర్ఫ్యూమ్నే క్రియేట్ చేసి ఇచ్చాడు. మరో మహిళ చనిపోయిన తన భర్త చొక్కాను తీసుకెళ్లి అలాంటి వాసననిచ్చే పర్‌ఫ్యూమ్ చేయించుకుంది. ఇలా ప్రతిరోజూ ఎంతోమంది తమ జ్ఞాపకాలను కాపాడుకునేందుకు యూసుఫ్ షాప్‌కి వెళ్తుంటారు.