యూసఫ్ పఠాన్ విధ్వంసకర ఇన్నింగ్స్.. 26 బంతుల్లో 80 పరుగులు

యూసఫ్ పఠాన్ విధ్వంసకర ఇన్నింగ్స్.. 26 బంతుల్లో 80 పరుగులు

'యూసుఫ్ పఠాన్' ఇర్ఫాన్ పఠాన్ సోదరుడిగా, టీమిండియా మాజీ ఆల్ రౌండర్‌‌గా ఇతను అందరికీ సుపరిచితమే. రెండేళ్ల క్రితం అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన ఈ విధ్వంసకర హిట్టర్, ప్రస్తుతం జింబాబ్వే వేదికగా జరుగుతోన్న జిమ్ ఆఫ్రో టీ10 లీగ్‌లో ఆడుతున్నారు. జోబర్గ్ బెజోస్‌కు ఆడుతున్న యూసుఫ్ పఠాన్.. శుక్రవారం డర్బన్ క్వాలండర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో వీరవిహారం చేశారు. 26 బంతుల్లోనే 80 పరుగులు చేసి జట్టుకు ఒంటి చేత్తో విజయాన్ని అందించారు. 

తొలుత బ్యాటింగ్ చేసిన డర్బన్ క్వాలండర్స్ నిర్ణీత 10 ఓవర్లలో 140 పరుగులు చేసింది. అనంతరం 141 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి బెజోస్.. 6 ఓవర్లలోపే నాలుగు కీలక వికెట్లు కోల్పోయింది. ఇక ఓటమి ఖాయం అనుకున్న సమయంలో యూసుఫ్ పఠాన్.. క్వాలండర్స్ బౌలర్లపై ఎదురుదాడికి దిగారు. మైదానం నలువైపులా బౌండరీలు బాదుతూ వీరవిహారం చేశారు.
 
పఠాన్ ధాటికి బెజోస్ జట్టు 140 పరుగుల లక్ష్యాన్ని ఒక బంతి మిగిలివుండగానే చేధించింది. మొత్తంగా 26 బంతులు ఎదుర్కొన్న యూసుఫ్ పఠాన్.. 5 ఫోర్లు, 8 సిక్సర్లతో 80 పరుగులు చేశారు. ఈ విజయంతో జోబర్గ్ బెజోస్ ఫైనల్‌లో అడుగుపెట్టింది.