Yuvraj Singh: మోసం చేశారు.. న్యాయం చేయండి: ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించిన యువరాజ్‌

Yuvraj Singh: మోసం చేశారు.. న్యాయం చేయండి: ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించిన యువరాజ్‌

14 కోట్ల రూపాయలు డబ్బులు చెల్లించుకొని ఒక రియల్ ఎస్టేట్ సంస్థ తనకు ఫ్లాట్ స్వాధీనం చేయకుండా కాలయాపన చేస్తోందంటూ భారత మాజీ క్రికెటర్‌ యువరాజ్‌ సింగ్‌ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. నిర్ణీత గడువు ముగిసి ఏళ్లు గడుస్తున్నా.. తనకు ఫ్లాట్‌ డెలివరీ చేయడంలో రియల్ ఎస్టేట్ సంస్థ జాప్యం చేస్తోందని, ఈ వివాదాన్ని పరిష్కరించేందుకు మధ్యవర్తిని నియమించాలని యువీ కోర్టును కోరారు.

యువరాజ్ దాఖలు చేసిన పిటిషన్‌ అభ్యర్థనను క్లుప్తంగా విన్న ఢిల్లీ హైకోర్టు జస్టిస్ సి హరి శంకర్ సింగ్ సదరు రియల్ ఎస్టేట్ సంస్థ నుండి ప్రతిస్పందనను కోరారు. ఈ మేరకు రియల్ ఎస్టేట్ సంస్థ బ్రిలియంట్ ఎటోయిల్ ప్రైవేట్ లిమిటెడ్‌కు కోర్టు నోటీసులు జారీ చేసింది.

అసలేంటి ఈ వివాదం..?

యువీ 2021లో ఢిల్లీలోని హౌస్‌ఖాన్‌ సంస్థతో ఒక ఫ్లాట్‌ బుక్‌ చేశారు. ఆ సమయంలో ఫ్లాట్‌ ధర రూ.14.10కోట్లట. ఇంత పెద్ద మొత్తంలో డబ్బులు చెల్లించుకున్న రియల్ ఎస్టేట్ సంస్థ నాసిరక నిర్మాణాలు చేపట్టింది. ఈ విషయం యువీకి ఫ్లాట్ స్వాధీనం చేసుకోవాలని కంపెనీ నుంచి లెటర్‌ వచ్చాక తెలిసింది. తన కలల సౌధం చూద్దామని ఫ్లాట్‌కి వెళ్లగా.. ఇంటి లోపల నిర్మాణం చూసి భారత క్రికెటర్ కంగుతిన్నారు. ఈ విషయపై యువీ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించాడు. 

బిల్డర్ మెటీరియల్ నాణ్యతలో రాజీ పడ్డాడని, అపార్ట్‌మెంట్ యొక్క ఫిట్టింగ్‌లు, ఫర్నిషింగ్‌లు, లైటింగ్, ఫినిషింగ్ నాణ్యతను తగ్గించాడని న్యాయమూర్తికి విన్నవించుకున్నాడు. ఫ్లాట్ డెలివరీలో జాప్యం, నాసిరకం మెటీరియల్స్ వాడినందుకు తనకు నష్టపరిహారం చెల్లించాలని కోరాడు. 

డెవలపర్ తన బ్రాండ్ విలువను దుర్వినియోగం చేశాడని, ఒప్పంద కాలానికి మించి తన వ్యక్తిత్వ హక్కులను ఉపయోగించడం ద్వారా అవగాహన ఒప్పంద (MOU) నిబంధనలను ఉల్లంఘించాడని యువీ తన పిటిషన్‌లో పేర్కొన్నాడు. MOU ప్రకారం నవంబర్ 2023 తర్వాత ప్రాజెక్టు బిల్‌బోర్డులు, సైట్‌లు, సోషల్‌ మీడియా పోస్టుల్లో యువీ ఫొటోలు ఉపయోగించరాదు. అయితే బిల్డర్ అలానే కొనసాగించాడు. ఈ విషయాన్నీ యువీ ధర్మసనం దృష్టికి తీసుకోచ్చారు. భారత క్రికెటర్ తరుపున రిజ్వాన్ లా అసోసియేట్స్ కు చెందిన న్యాయవాది రిజ్వాన్ కేసును వాదించారు.