Ranji Trophy 2024: 2 మ్యాచ్‌ల్లో 294 బంతులు.. ద్రవిడ్, పుజారాను తలపిస్తున్న చాహల్

టీమిండియా లెగ్ స్పిన్నర్ గా తనదైన ముద్ర వేసిన యుజ్వేంద్ర చాహల్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అతని గూగ్లీలకు స్టార్ బ్యాటర్లు సైతం బయపడాల్సిందే. ఇంతవరకు చాహల్ గురించి తెలిసిందే అయినా.. అతనిలో అద్భుతమైన బ్యాటర్ ఉన్నాడని తాజాగా తెలిసింది. ప్రస్తుతం జరుగుతున్న రంజీ ట్రోఫీలో చాహల్ బ్యాటింగ్ లో సత్తా చాటుతున్నాడు. అద్భుతమైన డిఫెన్సివ్ తో ఆశ్చర్యపరుస్తున్నాడు. 

మధ్యప్రదేశ్‌తో జరిగిన 2024 రంజీ ట్రోఫీ ఎలైట్ గ్రూప్ సి మ్యాచ్‌లో హర్యానా తరపున చాహల్ ఆడుతున్నాడు. ఇండోర్‌లోని హోల్కర్ క్రికెట్ స్టేడియంలో జరుగుతున్న ఈ మ్యాచ్ లో 10 వ స్థానంలో బ్యాటింగ్ కు వచ్చి 142 బంతులు ఎదుర్కొన్నాడు. 27 పరుగులు చేసి 9 వికెట్ కు హర్షల్ పటేల్ తో కీలకమైన 67 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. అంతకముందు ఉత్తర ప్రదేశ్ తో జరిగిన మ్యాచ్ లోనూ చాహల్ 48 పరుగులు చేయడం విశేషం. ఈ మ్యాచ్ లో 152 బంతులు ఎదుర్కోవడం విశేషం. 

చాహల్ బ్యాటింగ్ పై సోషల్ మీడియాలో అభిమానులు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. చాహల్ బ్యాటింగ్ కూడా చేయగలడని కొందరు అంటుంటే.. ద్రవిడ్, పుజారా మాకు గుర్తుకు వచ్చాడంటూ మరికొందరు కామెంట్స్ చేస్తున్నారు. ఇంకొందరు చాహల్ ను టీంఇండియాలో ఆల్ రౌండర్ గా ఎంపిక చేయాలనీ సెటైర్ వేస్తున్నారు. ప్రస్తుతం చాహల్ టీమిండియా స్థానం కోల్పోయాడు. 2024 టీ20 వరల్డ్ కప్ లో చాహల్ చివరిసారిగా భారత జట్టు స్క్వాడ్ లో ఉన్నాడు.