Vijay Hazare Trophy: ఫామ్‌లో ఉన్నా పక్కన పెట్టారు.. విజయ్ హజారే ట్రోఫీలో చాహల్‌పై వేటు

టీమిండియా లెగ్ స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్‌కు బ్యాడ్ టైం నడుస్తుంది. ఫామ్ లో ఉన్నప్పటికీ భారత క్రికెట్ జట్టులో చోటు దక్కించుకోలేకపోతున్న చాహల్ కు వ్యక్తిగత జీవితం అంత సాఫీగా లేనట్టు తెలుస్తోంది. అతని భార్య ధనశ్రీ వర్మతో త్వరలో విడాకులు తీసుకోబోతున్నాడనే వార్తలు వైరల్ అవుతున్నాయి. ఇటీవలే ఇంస్టాగ్రామ్ లో ధనశ్రీ వర్మ ఫోటీలు డిలీట్ చేయడంతో వీరిద్దరి మధ్య విడాకులకు మరింత బలం చేకూరింది. ఇదిలా ఉంటే చాహల్ కు మరో షాక్ తగిలింది. విజయ్ హజారే ట్రోఫీ కోసం అతడ్ని ఎంపిక చేయలేదు. 

హర్యానా నేడు (జనవరి 9) క్వార్టర్ ఫైనల్ లో బెంగాల్ తో తలబడుతుంది. కీలకమైన నాకౌట్ మ్యాచ్ లకు చాహల్ ను ఎంపిక చేయకుండా పక్కన పెట్టడం ఆశ్చర్యానికి గురి చేసింది. చాహల్ తన భార్య ధనశ్రీ నుండి విడాకులు తీసుకుంటారనే అనే ఊహాగానాలు ఎక్కువయ్యాయి. ఈ కారణంగానే చాహల్ ను ఎంపిక చేయలేదనే వార్తలు వస్తున్నాయి. అయితే ఈ వార్తల్లో నిజం లేదని తేలిపోయింది. భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని తమ ప్రధాన స్పిన్నర్ చాహల్ ను పక్కన పెట్టాలని నిర్ణయం తీసుకున్నామని హర్యానా క్రికెట్ అసోసియేషన్ అధికారి తెలిపారు. యువ స్పిన్నర్ పార్త్ వాట్స్‌కు ఎక్కువ అవకాశాలను ఇవ్వడానికి సిద్ధంగా ఉందని ఆయన తెలిపాడు. 

Also Read :- రంజీ ట్రోఫీ కాదు ఇంగ్లాండ్ కౌంటీల్లో ఆడనున్న కోహ్లీ..

చాహల్ ఈ సీజన్‌లో ఒక్క మ్యాచ్ కూడా ఆడలేదు. గత సీజన్ లో హర్యానా టైటిల్ గెలవడంతో చాహల్ కీలక పాత్ర పోషించాడు. 18 వికెట్లతో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా నిలిచాడు. ప్రస్తుతం చాహల్ కు భారత జట్టులో చోటు దక్కడం కష్టంగానే కనిపిస్తుంది. టీ20 వరల్డ్ కప్ 2024 స్క్వాడ్ లో స్థానం దక్కినా అతనికి  ఆడే అవకాశం రాలేదు. ఆ తర్వాత సెలక్టర్లు చాహల్ పూర్తిగా పక్కన పెట్టేశారు. భవిష్యత్ లోనూ చాహల్ భారత జట్టులోకి రావడం కష్టంగానే కనిపిస్తుంది. అతని వయసు 34 ఏళ్ళు కావడం దీనికి ప్రధాన కారణం. 34 ఏళ్ల చాహల్ ఇప్పటివరకు భారత్ తరఫున 72 వన్డేలు, 80 టీ20లు ఆడాడు. రెండు ఫార్మాట్లలో కలిపి 217 వికెట్లు పడగొట్టాడు.