Yuzvendra Chahal: టీమిండియాలో నో ఛాన్స్.. ఇంగ్లాండ్ కౌంటీల్లో చాహల్

టీమిండియా లెగ్ స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్ ఇంగ్లాండ్ బయలుదేరనున్నాడు. అక్కడ జరగబోయే వన్-డే కప్‌లో చివరి మ్యాచ్ తో పాటు కౌంటీ ఛాంపియన్‌షిప్ డివిజన్-2 లో మిగిలిన ఐదు మ్యాచ్‌ల కోసం నార్తాంప్టన్‌షైర్‌ జట్టులో చేరాడు. ఈ విషయాన్నీ నార్తాంప్టన్‌షైర్‌ క్లబ్ బుధవారం (ఆగస్ట్ 14) అధికారికంగా ప్రకటించింది. బుధవారం జట్టుతో కలుస్తాడని నార్తాంప్టన్‌షైర్ తమ  వెబ్‌సైట్‌లో తెలిపింది.

కెంట్‌లో జరిగే చివరి వన్డే కప్ మ్యాచ్, మిగిలిన ఐదు కౌంటీ ఛాంపియన్‌షిప్ మ్యాచ్‌ల కోసం టీమిండియా స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్ క్లబ్‌లో చేరడం పట్ల నార్థాంప్టన్‌షైర్ కౌంటీ క్రికెట్ క్లబ్ ఆనందంగా ఉందని నార్తాంప్టన్‌షైర్ ఒక ప్రకటనలో తెలిపింది. 2023 సీజన్‌లో కెంట్‌ తరపున ఆడిన చాహల్.. మరోసారి ఇంగ్లాండ్ దేశవాళీ క్రికెట్ లో అవకాశం దక్కడం ఇది రెండవ సారి. ఛాంపియన్‌షిప్ డివిజన్ వన్ మ్యాచ్‌లలో మొత్తం తొమ్మిది వికెట్లు పడగొట్టాడు. 

ప్రస్తుతం చాహల్ కు భారత జట్టులో చోటు దక్కడం కష్టంగానే కనిపిస్తుంది. టీ20 వరల్డ్ కప్ 2024 స్క్వాడ్ లో స్థానం దక్కినా అతనికి  ఆడే అవకాశం రాలేదు. ఆ తర్వాత సెలక్టర్లు చాహల్ పూర్తిగా పక్కన పెట్టేశారు. భవిష్యత్ లోనూ చాహల్ భారత జట్టులోకి రావడం కష్టంగానే కనిపిస్తుంది. అతని వయసు 34 ఏళ్ళు కావడం దీనికి ప్రధాన కారణం. 34 ఏళ్ల చాహల్ ఇప్పటివరకు భారత్ తరఫున 72 వన్డేలు, 80 టీ20లు ఆడాడు. రెండు ఫార్మాట్లలో కలిపి 217 వికెట్లు పడగొట్టాడు.