
ఆంధ్రప్రదేశ్: 2025, ఫిబ్రవరి 24 నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. గవర్నర్ ప్రసంగంతో అసెంబ్లీ సెషన్ షురూ కానుంది. అయితే, ఏపీ మాజీ సీఎం, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ ఈ సారైనా అసెంబ్లీ సమావేశాలకు హాజరు అవుతారా లేదా అన్నది రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. 2024లో జరిగిన ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ ఘోర ఓటమి పాలైన సంగతి తెలిసిందే. వైసీపీ కేవలం 11 సీట్లకే పరిమితం కావడంతో ఫ్యాన్ పార్టీకి అసెంబ్లీలో ప్రతిపక్ష హోదా కూడా దక్కలేదు. వైసీపీకి ప్రతిపక్ష హోదా రాకపోవడంతో జగన్ అసెంబ్లీ సమావేశాలకు హాజరు కావడం లేదు.
కేవలం ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేసేందుకు ఒక్కసారి మాత్రమే అసెంబ్లీకి వెళ్లారు. దీంతో ఈ సారైనా జగన్ అసెంబ్లీకి వెళ్తారా లేదా అన్న దానిపై ఉత్కంఠ నెలకొంది. ఈ క్రమంలో జగన్ అసెంబ్లీకి వెళ్తారా లేదా అన్న దానిపై వైసీపీ సీనియర్ నేత, రాజ్య సభ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి క్లారిటీ ఇచ్చారు. ఆదివారం (ఫిబ్రవరి 23) ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వంలో రాష్ట్రంలో అనేక సమస్యలు ఉన్నాయి. ప్రజలు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
Also Raed : ఏపీలో గ్రూప్ 2 ఎగ్జామ్స్ పై గొడవేంటి
ప్రజా సమస్యలను అసెంబ్లీలో లేవనెత్తేందుకు జగన్ అసెంబ్లీ సమావేశాలకు వెళ్తున్నారని వివరణ ఇచ్చారు. ఎవరికో భయపడి జగన్ అసెంబ్లీకి వెళ్లడం లేదని పేర్కొన్నారు. ఇటీవల గుంటూరు మిర్చి యార్డు పర్యటన సందర్భంగా వైసీపీ అధినేత జగన్కు కూటమి ప్రభుత్వం సరైన భద్రత కల్పించలేకపోవడంపై వైవీ సుబ్బారెడ్డి ఫైర్ అయ్యారు. గుంటూరు మిర్చి యార్డుకు వెళ్లినప్పుడు జగన్కు సరైన భద్రత కల్పించకుండా, ఆయనకు హాని కలిగించే విధంగా వ్యవహరించిందని విమర్శించారు.
ఈ విషయాన్ని కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళతామని చెప్పారు. జగన్ ఎక్కడకి వెళ్లినా జడ్ ప్లస్ భద్రతను కల్పించాలని డిమాండ్ చేశారు. జగన్కు ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వకుండా అవమానపరుస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్రంలో ఎన్నో సమస్యలు ఉన్నప్పటికీ ప్రభుత్వం పట్టించుకోవడం లేదని విమర్శించారు. కూటమి ప్రభుత్వంలో రైతుల పరిస్థితి దారుణంగా తయారైందని ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ నేతలు, కార్యకర్తలపై కూటమి ప్రభుత్వం తప్పుడు కేసులు పెడుతూ కక్ష సాధింపులకు పాల్పడుతోందని మండిపడ్డారు.