బుధవారం ( జనవరి 8, 2025 ) రాత్రి తిరుపతిలో వైకుంఠ ద్వార దర్శనం టోకెన్ల జారీ కేంద్రాల దగ్గర తొక్కిసలాట ఘటన కలకలం రేపింది. ఈ ఘటనలో 6 మంది మృతి చెందగా 40 మందికి పైగా గాయపడ్డారు. ఈ ఘటనపై సపండించిన టీటీడీ మాజీ చైర్మెన్, వైసీపీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. తిరుపతి ఘటన ఘోరమని..చైర్మెన్ బీఆర్ నాయుడు మాటలు ఆందోళన కలిగించాయని అన్నారు వైవీ సుబ్బారెడ్డి. తొక్కిసలాట ఘటన గురించి తెలిసాక దిగ్బ్రాంతికి గురయ్యానని.. గత ఐదేళ్ళలో సామాన్య భక్తులకు ఎలాంటి అసౌకర్యం లేకుండా వైకుంఠ ఏకాదశి, బ్రహ్మోత్సవాలు వంటి కార్యక్రమాలు ఎటువంటి ఒత్తిడి లేకుండా నిర్వహించామని అన్నారు.
గతంలో రెండు రోజులకు మాత్రమే పరిమితమైన వైకుంఠ ద్వారశి దర్శనాన్ని తమ హయాంలో పీఠాధిపతులతో చర్చించి భక్తుల సౌకర్యం కోసం 10 రోజులకు పెంచమని అన్నారు. తమ ప్రభుత్వ హాయంలో ఎటువంటి అపశృతులు చోటు చేసుకోకుండా వైకుంఠ ద్వార దర్శనాన్ని నిర్వహించామని అన్నారు. ఈ ఘటన జరగడం దురసృష్టకరమని.. దీనిపై ప్రభుత్వం ఎంక్వయిరీ వేసి బాద్యులపై చర్యలు తీసుకోవాలని అన్నారు.
Also Read : టోకెన్లు ఇచ్చేందుకే గేట్ ఓపెన్ చేశారని భక్తులు అనుకోవడంతో
మృతుల కుటుంబాలను టీటీడీ, ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేశారు. అధికారులతో టీటీడీ సరిగా పని చేయించలేదని అన్నారు వైవీ సుబ్బారెడ్డి. ఈ ఘటనలో తమవైపు నుండి ఎలాంటి తప్పు లేదని... ఇది దైవ నిర్ణయం అంటూ టీటీడీ చైర్మెన్ బీఆర్ నాయుడు మాట్లాడటం ఆందోళనకరమని అన్నారు. ఇది ముమ్మాటికీ అధికారులు, ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే జరిగిందని అన్నారు వైవీ సుబ్బారెడ్డి.