
తీర్పు తర్వాత కూడా వేధిస్తున్నారు.
సలీమ్ సినిమాకు సంబంధించి దర్శకుడు వైవీఎస్ చౌదరికి ఇచ్చిన చెక్.. బౌన్స్ అవడంతో నటుడు మోహన్ బాబుకు ఎర్రమంజిల్ కోర్టు ఏడాది జైలు శిక్ష విధించిన సంగతి తెలిసిందే. అయితే తీర్పు అనంతరం కూడా మోహన్ బాబు తనను వేధింపులకు గురి చేస్తున్నాడని వైవీఎస్ చౌదరి తాజాగా ఓ ప్రెస్ నోట్ ను రిలీజ్ చేశారు.
చెక్ బౌన్స్ కేసులో తనకు అనుకూలంగా కోర్టు తీర్పు వచ్చినప్పటినుంచి మోహన్ బాబు తనను ఇబ్బందులకు గురి చేస్తున్నాడని వైవీఎస్ చౌదరి ఆరోపించారు. ఇదే విషయమమై తన లాయర్ ద్వారా వైవీఎస్ లీగల్ నోటీసులు పంపారు. సలీం చిత్ర నిర్మాణ సమయంలోనే జల్‌పల్లి గ్రామంలో మోహన్ బాబు నివసిస్తున్న ఇంటిని ఆనుకుని ఉన్న అర ఎకరం స్ధలాన్ని తాను కొన్నానని వైవీఎస్ చౌదరి చెప్పారు.
అయితే చెక్ బౌన్స్ కేసులో కోర్టు తీర్పు అనంతరం తనను, తన మనుషుల్ని స్థలంలోకి రాకుండా మోహన్‌బాబు, ఆయన మనుషులు అడ్డుకుంటున్నారని వైవీఎస్ ఆరోపించారు. తాను కష్టార్జితంతో కొనుక్కున్న ఇంటి స్థలం విషయంలో మోహన్ బాబు సమస్యలు సృష్టిస్తుండటంతో, ఇన్నేళ్లగా జరిగిన, జరుగుతున్న ఉదంతాలపై శాశ్వత పరిష్కారం కోసం న్యాయ నిపుణులను ఆశ్రయించినట్లు వైవీఎస్ తెలిపారు. పూర్తి వివరాలకై తమ న్యాయవాదులు ఆయనకు పంపిన లీగల్ నోటీసును ఈ లేఖతో జత చేస్తున్నానని వైవీఎస్ చౌదరి ఓ లేఖను విడుదల చేశారు