జాఫర్​ బావికి నిధుల కొరత.. పైసల్లేక అర్ధంతరంగా ఆగిన అభివృద్ధి పనులు

  •     గతేడాది రూ.12.50 లక్షలతో పూడికతీత
  •     చుట్టూ ప్రహరీ, లైటింగ్ కోసం మరో రూ.40 లక్షల అంచనా
     

ఖమ్మం, వెలుగు: ఖమ్మం నగరంలో 900 ఏళ్ల చరిత్ర కలిగిన జాఫర్​బావికి పూర్వ వైభవాన్ని తెచ్చేందుకు చేపట్టిన పనులు నిధుల కొరతతో నిలిచిపోయాయి. ఒకప్పటి మంచినీటి బావిని, మళ్లీ పాత రూపు తీసుకువచ్చి టూరిస్ట్ ఎట్రాక్షన్​ గా మార్చాలని చేసిన ప్రయత్నాలకు  బ్రేక్​ పడింది.  ఖమ్మం నగరం నడిబొడ్డున సుమారు నాలుగు చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఖిల్లా ఉంది.

ఖిల్లాను ఆనుకొని జాఫర్​ మెట్ల బావి ఉంది. కాకతీయుల కాలంలో దీనిని మంచినీటి బావిగా ఉపయోగించేవారు. ఆ తర్వాత వరద నీటితో వచ్చిన చెత్త నిండిపోవడం, స్థానికులు కూడా చెత్తను వేసే డంప్​యార్డుగా ఉపయోగించడంతో మొత్తం పూడికతో నిండిపోయింది. 60 అడుగుల లోతు, 30 అడుగుల వెడల్పుతో నిర్మాణమైన ఈ మెట్ల బావి చుట్టూ బ్రిడ్జి కూడా నిర్మించారు. అప్పట్లో మనుషులతో పాటు గుర్రాలు తిరిగేందుకు దీన్ని నిర్మించి ఉంటారని భావిస్తున్నారు. 

గతేడాది పునరుద్ధరణ పనులు.. 

ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ (కేఎంసీ) నుంచి రూ.12.50 లక్షల​ నిధులతో గత ఎండాకాలం పనులు చేపట్టారు. సుమారు 60 అడుగుల మేర పూడికను తొలగించారు. మున్సిపల్​ కార్పొరేషన్​, పురావస్తు శాఖ, టూరిజం డిపార్ట్ మెంట్ అధికారులతో సమన్వయం చేసుకుంటూ ‘ది రెయిన్ ​వాటర్ ​ ప్రాజెక్ట్’ అనే సంస్థ ఈ పనులు చేసింది. ఆ తర్వాత పనులు కొనసాగించడానికి ఆర్థిక ఇబ్బందులు ఎదురయ్యాయి.

పురావస్తుశాఖ దగ్గర నిధులు లేకపోవడంతో ప్రభుత్వ నిధులపై ఆధారపడాల్సి వస్తోంది. కొత్తగా వచ్చిన ప్రజాప్రతినిధులు చొరవతీసుకున్నా, కార్పొరేట్​ సంస్థలు ముందుకు రావడం లేదు. స్వచ్ఛంద సంస్థలు సహకరిస్తే తప్ప ఆధునిక హంగులు, లైటింగ్ ఏర్పాటు చేసే పరిస్థితి కనిపించడం లేదు.  

మరో రూ.40 లక్షలు కావాల్సిందే.. 

పూడికతీత తర్వాత బావి చుట్టుపక్కన ప్రాంతాలు ఆక్రమణలకు గురికాకుండా ప్రహరీ గోడ లేదా ఫెన్సింగ్ నిర్మించాలని, పార్క్ తో పాటు లైటింగ్​ ఏర్పాటు చేయాలని ప్లాన్ ​చేశారు. వీటన్నింటికి కనీసం రూ.40 లక్షలకు పైగా ఖర్చు అవుతుందని అంచనా వేస్తున్నారు. అయితే పురావస్తు శాఖ దగ్గర నిధులు లేకపోవడంతో, కొత్త ప్రభుత్వమైనా నిధులు కేటాయించాలని కోరుతున్నారు. ఈ బావి పునరుద్ధరణకు అదనపు హంగులు తోడైతే, మరో టూరిస్ట్ ఎట్రాక్షన్​ గా మారుతుందని ఆఫీసర్లు భావిస్తున్నారు. 

ఇతర మార్గాల ద్వారా నిధులు తెచ్చుకోవాల్సిందే..

ఖమ్మం​ఖిల్లా పురావస్తు శాఖ ఆధీనంలో ఉన్నా.. బడ్జెట్ లేకపోవడం వల్ల మున్సిపల్ కార్పొరేషన్​ నిధులతో పూడిక తీత పనులు జరిగాయి. అదనంగా ఇప్పుడు ఇంకా పనులు చేయాలంటే ఇతర మార్గాల ద్వారా నిధులు తెచ్చుకోవాల్సిందే. శాఖాపరమైన అనుమతులివ్వడం మాత్రమే మా పరిధిలో ఉంది.   
– మల్లు నాయక్​, పురావస్తు శాఖ 
అడిషనల్​ డైరెక్టర్​, వరంగల్

స్పాన్సర్లతో మాట్లాడుతున్నాం..

ఖమ్మం జాఫర్​ బావిలో ఇప్పటి వరకు పూడికతీత పనులు మాత్రమే పూర్తయ్యాయి. మంచి టూరిజం స్పాట్ గా మార్చాలంటే రూ.40 లక్షల నుంచి రూ.50 లక్షల వరకు ఖర్చయ్యే అవకాశముంది. రెండు కార్పొరేట్​సంస్థలతో ఇప్పటికే మాట్లాడుతున్నాం. వాళ్లు గానీ, ఇంకెవరైనా స్పాన్సర్ ముందుకు వస్తే బావిని మరింత అందంగా తీర్చిదిద్దవచ్చు. 
– కల్పనా రమేశ్, ది రెయిన్​వాటర్​ ప్రాజెక్ట్ ఫౌండర్

ఎప్పటికప్పుడు నీళ్లు తోడకుంటే మళ్లీ మొదటికే..!

సికింద్రాబాద్​లోని బన్సీలాల్ పేట మెట్లబావిని అద్భుతమైన టూరిస్ట్ ఎట్రాక్షన్​ గా తీర్చిదిద్దిన సంస్థ, ఖమ్మంలోని జాఫర్​ బావిని కూడా అదే తరహాలో తయారు చేసేందుకు ముందుకు వచ్చి ఇంత వరకు పనులు చేసింది.  కానీ ఇప్పుడు నిధులు లేకపోవడంతో దాతలపై ఆధారపడాల్సి వస్తోంది. వారు స్పాన్సర్​ చేయకపోతే మళ్లీ పాత స్థితికి చేరే ప్రమాదం ఉంది.

ఇప్పటికే మళ్లీ బావిలో సగం మేర నీరు చేరడం, ఆ నీరు కూడా పాకురుపట్టి ఉండడంతో గతేడాది చేసిన పనులు కూడా నిరుపయోగంగా మారే అవకాశం ఉందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. రెండ్రోజులకు ఒకసారి బావిలోని నీటిని తోడితేనే చేసిన పనులతో ఉపయోగం ఉంటుందని స్థానికులు చెబుతున్నారు.