![Zaheer Khan: పాకిస్థాన్‌కు షాక్.. ఛాంపియన్స్ ట్రోఫీ సెమీఫైనలిస్టులను చెప్పిన జహీర్ ఖాన్](https://static.v6velugu.com/uploads/2025/02/zaheer-khan-revealed-his-choice-regarding-the-champions-trophy-2025-semi-finalists_pUNMahtuDi.jpg)
ప్రస్తుతం క్రికెట్ ప్రేమికుల దృష్టి అంతా మరో 12 రోజుల్లో జరగబోయే ఛాంపియన్స్ ట్రోఫీపైనే ఉంది. ఈ మెగా టోర్నీ ఫిబ్రవరి 19 నుండి మార్చి 9 వరకు.. అంటే 19 రోజుల పాటు అభిమానులను అలరించనుంది. ఫిబ్రవరి 19న కరాచీ వేదికగా ఆతిథ్య పాకిస్థాన్ జట్టు.. ప్రారంభ మ్యాచ్‌లో న్యూజిలాండ్‌తో తలపడనుంది. ఈ టోర్నీలో భారత జట్టు.. ఫిబ్రవరి 20న బంగ్లాదేశ్‌తో తమ మొదటి మ్యాచ్ ఆడుతుంది. స్వదేశంలో జరగనుండడంతో పాకిస్థాన్ ఈ టోర్నీలో టైటిల్ ఫేవరేట్ గా బరిలోకి దిగుతుంది. భారత్, ఆస్ట్రేలియా జట్లు కూడా టైటిల్ రేస్ లో ఉన్నాయి.
హైబ్రిడ్ మోడల్‌లో జరగనున్న ఈ టోర్నీకి పాకిస్థాన్‌తోపాటు దుబాయ్ ఆతిథ్యం ఇవ్వనుంది. భారత జట్టు ఆడే మ్యాచ్‌లు దుబాయిలో జరగనుండగా.. మిలిగిన జట్లు తలపడే మ్యాచ్‌లు పాకిస్థాన్‌లో జరగనున్నాయి. ఛాంపియన్స్ ట్రోఫీకి ముందు ఏ జట్లు సెమీ ఫైనల్ కు వెళ్తాయో టీమిండియా మాజీ ఫాస్ట్ బౌలర్ జహీర్ ఖాన్ జోస్యం చెప్పాడు. ఇందులో భాగంగా ఆతిధ్య పాకిస్థాన్ కు బిగ్ షాక్ ఇచ్చాడు. పాకిస్థాన్ సెమీ ఫైనల్ కు వెళ్ళదని తేల్చి చెప్పాడు. భారత్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, సౌతాఫ్రికా జట్లు సెమీ ఫైనల్ కు చేరుకుంటాయని తెలిపాడు.
Also Read :- నాలుగు ఓవర్లలో 72 పరుగులా
జహీర్ ఖాన్ మాట్లాడుతూ.. " సెమీ-ఫైనల్స్‌కు భారత్ చేరుకుంటుందనడంలో ఎటువంటి సందేహం లేదు. ఆస్ట్రేలియా ఐసీసీ టోర్నీల్లో ఎప్పుడూ చక్కగా రాణిస్తుంది. ఛాంపియన్స్ ట్రోఫీలో న్యూజిలాండ్ రికార్డ్ అద్భుతంగా ఉంది. ఆ జట్టు కూడా సెమీస్ కు అర్హత సాధిస్తుంది. నాలుగో జట్టుగా సౌతాఫ్రికా సెమీ ఫైనల్ కు చేరుకుంటుంది. ఇటీవలే కాలంలో వారు వైట్-బాల్ క్రికెట్‌లో అద్భుతంగా రాణిస్తున్నారు. డిఫెండింగ్ ఛాంపియన్ లుగా బరిలోకి దిగుతున్న పాకిస్థాన్ వన్డేల్లో నిలకడగా రాణించలేకపోతుంది. ఆ జట్టు సెమీస్ కు చేరుకోవడం కష్టం". అని జహీర్ ఖాన్ చెప్పుకొచ్చాడు.