
- స్పెషల్ టీంల ఏర్పాటు
- యూత్, మహిళలే టార్గట్
- పోస్టులపై పోలీసుల నిఘా
సంగారెడ్డి, వెలుగు : జహీరాబాద్ పార్లమెంట్ బరిలో నిలబడ్డ అభ్యర్థులు సోషల్ మీడియా ప్రచారం మీద ఫోకస్ పెట్టారు. ఇందుకోసం ప్రత్యేకంగా టీమ్‌లను ఏర్పాటు చేసుకుంటున్నారు. నోటిఫికేషన్ రావడానికి ఇంకా సమయం ఉండడంతో, నామినేషన్ల ప్రారంభానికి ముందే ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. బీజేపీ , కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతలు తమ కార్యకర్తలు, మద్దతుదారుల ద్వారా రోజూ రకరకాల పోస్టులు పెట్టిస్తున్నారు.
తమ ఇమేజ్ను పెంచుకునేలా.. ప్రత్యర్ధులను ఇరుకున పెట్టేలా పోస్టులు వైరల్ చేసేందుకు కొత్తకొత్త ప్రయోగాలు చేస్తున్నారు. యువత, మహిళలే టార్గెట్‌గా క్యాండిడేట్లు, వారి అనుచరులు ప్రచారం చేస్తున్నారు. ప్రజాసేవ చేసేందుకు అవకాశం ఇవ్వాలంటూ అభ్యర్థిస్తున్నారు. ఎన్నికల్లో గెలిస్తే చేపట్టే అభివృద్ధి పనులపై అభ్యర్థులు వాట్సాప్, ఫేస్ బుక్, ఇన్ స్టాగ్రామ్ ల ద్వారా ఓటర్లకు కరపత్రాలు చేరవేస్తున్నారు.
అభ్యర్థుల మద్దతుదారులు వార్డుల వారీగా ఓటర్ల ఫోన్ నెంబర్లను సేకరించి ప్రత్యేక వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేస్తున్నారు. వారికి ఎప్పటికప్పుడు మెసేజ్‌లు ఫార్వర్డ్ చేస్తున్నారు. ఇంటింటి ప్రచారం తోపాటు నేరుగా ఓటరుకు ఫోన్ చేస్తే మరింత ఫలితం ఉంటుందని భావిస్తున్న అభ్యర్థులు కాస్త టైం దొరికితే చాలు ఓటర్లకు ఫోన్ చేసి ఓటు వేయాలని అభ్యర్థిస్తున్నరు. ఐఈఆర్‌ఎస్ ద్వారా వాయిస్ మెసేజీలు పంపుతున్నారు.
పోలీసుల నిఘా
జహీరాబాద్ పార్లమెంట్ బరిలో నిలిచిన అభ్యర్థులు చేస్తున్న సోషల్ మీడియా ప్రచారాలపై ఎన్నికల యంత్రాంగం నిఘా పెట్టింది. సోషల్ మీడియా ద్వారా పెట్టే పోస్టులు, ప్రచారాలవల్ల కొన్ని సందర్భాల్లో వివాదాలు తలెత్తే అవకాశాలు ఉండడంతో పోలీసులు అభ్యర్థులు, వారి ప్రధాన అనుచరులపై ఓ కన్నేసి ఉంచారు. అభ్యంతరకర పోస్టులు పంపకుండా చర్యలు తీసుకుంటున్నారు.
వ్యక్తిగత విమర్శలు, సెన్సిటివ్ అంశాలు, ప్రజల మధ్య వైషమ్యాలు సృష్టించేలా ఎలాంటి ప్రకటనలు, వ్యాఖ్యలు చేయరాదని ఇదివరకే పార్టీల నాయకులకు స్పష్టం చేసిన ఎన్నికల అధికారులు సోసల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలోనూ ఈ నిబంధనలు ఖచ్చితంగా అమలయ్యేలా జాగ్రత పడుతున్నారు. జహీరాబాద్ పార్లమెంట్ నియోజవర్గ పరిధిలో నియమావళిని ఉల్లఘించినట్టు ఫిర్యాదులు రాగా.. సంబంధిత వ్యక్తులను ఎన్నికల అధికారులు పిలిపించి.. మరోసారి ఇలాంటి పొరపాట్లు చేయరాదంటూ హెచ్చరించి పంపారు. జహీరాబాద్, అందోల్, జుక్కల్, నారాయణఖేడ్ అసెంబ్లీ సెగ్మెంట్లలో పలువరి మీద కోడ్ ఉల్లంఘన ఫిర్యాదులు వచ్చినట్టు తెలుస్తోంది. ఎన్నికలు సమీపిస్తున్నా కొద్ది ఆన్లైన్ ప్రచారం మరింత ముమ్మరం చేసేందుకు పార్టీలు సిద్ధమవుతున్నాయి.