- గత ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల దాదాపు రూ.5 కోట్లు వెనక్కి
- పూడికతీత, గేట్ల రిపేర్లు, కట్ట ఎత్తు పెంచక వృథాగా పోతున్న నీరు
- ప్రాజెక్టు కింద ఉన్న 6 వేల ఎకరాల్లో ఒక్క ఎకరం తడవట్లేదు
- ఉపయోగంలోకి తీసుకురావాలని కోరుతున్న రైతులు
సంగారెడ్డి, వెలుగు: 70 ఏళ్ల చరిత్ర కలిగిన జహీరాబాద్ నారింజ ప్రాజెక్టు శిథిలావస్థకు చేరింది. దీంతో ప్రాజెక్టు కింద ఉన్న ఆయకట్టు భూములు బీడుగా మారుతున్నాయి. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ నియోజకవర్గం కొత్తూరు (బి) గ్రామ సమీపంలో 1970లో నారింజ ప్రాజెక్టు నిర్మించారు. కుడి, ఎడమ కాల్వల ద్వారా 6 వేల ఎకరాలకు నీరందించే విధంగా ప్రాజెక్టును నిర్మించగా కొంతకాలం తాగు, సాగునీటి వినియోగం బాగానే జరిగింది. కాగా గడిచిన 12 ఏళ్లుగా ప్రాజెక్టుకు రిపేర్లు లేక 7 గేట్లు శిథిలావస్థకు చేరగా వర్షం నీళ్లు పక్కనే ఉన్న కర్నాటకలోని కారింజ ప్రాజెక్టులోకి వెళ్లిపోతున్నాయి.
పూడికతీత, కాల్వల నిర్మాణం, కట్ట ఎత్తు పెంచడం, గేట్ల రిపేర్లకు ఉమ్మడి ఏపీలో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం రూ.5.77 కోట్లు మంజూరు చేసింది. తర్వాత రాష్ట్రంలో మారిన రాజకీయ పరిస్థితులకు అనుగుణంగా కొంతకాలం రిపేర్ పనులు పెండింగ్ లో పడ్డాయి. అనంతరం రాష్ట్రంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడ్డాక పాత నిధులలో నుంచి పూడికతీత కోసం కోటి రూపాయలు ఖర్చు చేసి మిగిలిన పనులు పెండింగ్ లో పెట్టి ప్రాజెక్టును పట్టించుకోలేదు. దీంతో ప్రాజెక్ట్ రిపేర్ల కోసం ఉంచిన బ్యాలెన్స్ ఫండ్స్ కొంతకాలానికి రిటర్న్ వెళ్లిపోయాయి.
కాల్వలు సరిగ్గా లేక..
నారింజ ప్రాజెక్టు కుడి, ఎడమ కాలువలు సరిగ్గా లేక ఆరువేల ఎకరాలు బీడు వారుతున్నాయి. అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం మంజూరు చేసిన ఫండ్స్ బీఆర్ఎస్ ప్రభుత్వం సరిగ్గా వినియోగించకపోవడంతో ఆయా కాల్వల నిర్మాణం అసంపూర్తిగానే ఉన్నాయి. కాల్వలకు రిపేరు చేయాలని ప్రతి జిల్లా పరిషత్ మీటింగ్ లో లేవనెత్తినా ఎవరూ పట్టించుకోలేదు. ప్రాజెక్టు సమస్యపై కొంతకాలం రైతు సంఘాలు కొట్లాడినప్పటికీ అప్పటి ప్రజాప్రతినిధులు లైట్ గా తీసుకున్నారు. చివరకు మూడేళ్ల కింద కొంతవరకు ప్రాజెక్టులో పూడికతీత పనులు నిర్వహించి చేతులు దులుపుకున్నారు.
ప్రమాదంలో ప్రాజెక్టు
జహీరాబాద్ నుంచి కర్నాటక రాష్ట్రానికి ఏర్పాటు చేసిన హైవేను ఆనుకొని ఉన్న ప్రాజెక్టు 7 గేట్లు ప్రమాదం అంచున ఉన్నాయి. గేట్లు పూర్తిగా శిథిలావస్థకు చేరడమే కాకుండా ప్రాజెక్టుపై నిర్మించిన బ్రిడ్జి (రోడ్డు) కూలిపోయే పరిస్థితిలో ఉంది. అదే జరిగితే హైవే రోడ్డు పూర్తిగా తెగిపోయి పెను ప్రమాదం సంభవించే అవకాశాలు ఉన్నాయి. ప్రస్తుతానికి ప్రాజెక్టులో నీటి నిల్వ బాగానే ఉంది. అయితే ఇప్పుడున్న కట్టకు రిపేర్లు చేయకుంటే అది ఎప్పుడు కూలుతుందో తెలియని పరిస్థితి నెలకొంది. అలాగే జహీరాబాద్ మున్సిపాలిటీ, రేజింతల్, మల్కాపూర్, దిండి, కొత్తూరు, మిర్జాపూర్ పరిసర ప్రాంతాల్లోని డ్రైనేజీ నీరంతా ఈ ప్రాజెక్టులోకి వచ్చి చేరుతుంది. ప్రస్తుత పరిస్థితుల్లో పశువులు కూడా ఈ నీటిని తాగలేకపోతున్నాయి. మరి కొంతకాలం ఇలాగే వదిలేస్తే హైదరాబాద్ మూసి నదిని తలపించనుంది.
ప్రాజెక్టులో సమస్యలు
నారింజ ప్రాజెక్టుకు సంబంధించి అనేక సమస్యలు గత పాలకుల నిర్లక్ష్యాన్ని ఎత్తిచూపుతున్నాయి. మట్టి పూడికతీత, కాల్వల నిర్మాణం, కట్ట ఎత్తు పెంచడం, గేట్ల రిపేర్లు వంటి సమస్యలు నెలకొన్నాయి. వీటికి అవసరమైన టెండర్ల ప్రక్రియ పూర్తి చేయాల్సి ఉన్నా ఇప్పటివరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదని రైతులు ఆరోపిస్తున్నారు. జిల్లా యంత్రాంగం ఈ ప్రాజెక్టుపై దృష్టి పెట్టడం లేదని ఆయకట్టు రైతులు అంటున్నారు. కనీసం కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలోనైనా నారింజ ప్రాజెక్టుకు రిపేర్లు చేయించి ఉపయోగంలోకి తీసుకురావాలని రైతులు కోరుతున్నారు.
కట్ట ఎత్తు పెంచాల్సిందే
ప్రాజెక్టులో పూడికతీత పనులు చేపట్టి కట్ట ఎత్తును పెంచాల్సిందే. మూడేళ్ల కింద కొంతమేర పూడికతీత పనులు చేపట్టినా ప్రస్తుతం ప్రాజెక్టు ఎత్తు మీటరు కంటే ఎక్కువ ఉండదు. పైగా జహీరాబాద్ పరిసర గ్రామాల నుంచి వచ్చే మురుగునీరు ప్రాజెక్టులో చేరుతుంది. ఇంకొన్ని రోజులు ఇలాగే వదిలేస్తే ప్రాజెక్టు మొత్తం మురుగు నీటితో నిండిపోతుంది. అప్పుడు ఎంత నీరు ఉన్నా రైతులకు ఉపయోగకరంగా ఉండదు. ఈ ప్రాజెక్టు గురించి కాంగ్రెస్ ప్రభుత్వం చొరవ తీసుకొని రిపేర్లు చేపట్టి రైతులకు సాగునీరు అందించాలి
మల్లేశం, కొత్తూరు(బి)
ఆ పాపం బీఆర్ఎస్ దే
గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో జరిగిన నిర్లక్ష్యం వల్లే నారింజ ప్రాజెక్టు ప్రమాదంలో పడింది. ప్రాజెక్టు రిపేర్లకు వెంటనే టెండర్లు పిలిచి పనులు మొదలు పెడతామని అప్పట్లో మంత్రి హోదాలో హరీశ్ రావు చెప్పి పట్టించుకోలేదు. మరుగున పడిన ప్రాజెక్టును మళ్లీ పునరుద్ధరించి వ్యవసాయానికి నిరందించాలే. అప్పుడే ఆయకట్టు రైతులు సంతోషంగా ఉంటారు. ఇప్పటికైనా సీఎం రేవంత్ రెడ్డి నారింజ ప్రాజెక్టు సమస్యను పరిష్కరించి రైతులకు మేలు చేస్తే బాగుంటది.
వెంకటేశ్వర్లు, (మల్కాపూర్)