జహీరాబాద్​ సెగ్మెంట్​లో..గెలుపెవరిదో!

  •     పార్లమెంట్​ ఎన్నికలకు సిద్ధమవుతున్న పార్టీలు
  •     అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన జోష్​లో కాంగ్రెస్ ​శ్రేణులు
  •     సిట్టింగ్ ​స్థానాన్ని నిలబెట్టుకోవాలని బీఆర్ఎస్
  •     పాగా వేయాలని బీజేపీ ప్రయత్నాలు

కామారెడ్డి, వెలుగు : త్వరలో జరిగే పార్లమెంట్​ఎన్నికల్లో జహీరాబాద్​సెగ్మెంట్​లో సత్తా చాటాలని మూడు ప్రధాన పార్టీలు ఉవ్విళ్లూరుతున్నాయి. ఆయా పార్టీలు అంతర్గత సమావేశాలు, ముఖ్య నాయకుల మీటింగులు నిర్వహిస్తూ ఎన్నికలకు సన్నద్ధమవుతున్నారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచి కాంగ్రెస్​ ఫుల్​జోష్ లో ఉండగా, సిట్టింగ్​స్థానాన్ని నిలబెట్టుకోవాలని బీఆర్ఎస్ పావులు కదుపుతోంది. బీజేపీ సైతం విజయం కోసం ముమ్మర కసరత్తు చేస్తోంది. కామారెడ్డి జిల్లాలోని కామారెడ్డి, ఎల్లారెడ్డి, బాన్సువాడ, జుక్కల్ నియోజకవర్గాలతో పాటు సంగారెడ్డి జిల్లాలోని జహీరాబాద్, నారాయణ్​ఖేడ్, అందోల్ నియోజకవర్గాలు జహీరాబాద్ ​పార్లమెంట్​ పరిధిలోకి వస్తాయి. 

కైవసం చేసుకోవాలని కాంగ్రెస్​

అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించిన కాంగ్రెస్,​ అదే జోష్​తో అత్యధిక ఎంపీ స్థానాలు కైవసం చేసుకోవాలని భావిస్తోంది. ఆయా పార్లమెంట్ ​నియోజకవర్గాలకు ఇన్​చార్జులను నియమించి తన కార్యచరణను షురూ చేసింది. జహీరాబాద్ ​పార్లమెంట్ సెగ్మెంట్​ఇన్​చార్జిగా బోధన్​ఎమ్మెల్యే పి.సుదర్శన్​రెడ్డిని నియమించారు. 2019 ఎన్నికల్లో పార్టీ అభ్యర్థిగా బరిలో దిగిన మదన్​మోహన్​రావు 6,229 ఓట్ల స్వల్ప తేడాతో  బీబీ పాటిల్ చేతిలో ఓడిపోయారు. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో పార్లమెంట్​పరిధిలోని ఏడు నియోజకవర్గాల్లో ఎల్లారెడ్డి, జుక్కల్, నారాయణ్​ఖేడ్, ఆందోల్​లో​ కాంగ్రెస్​ విజయం సాధించింది. తమ కంచు కోట జహీరాబాద్​లో తిరిగి పాగా వేయాలని కాంగ్రెస్​ భావిస్తోంది.  

సత్తా చాటాలని బీజీపీ

కేంద్రంలో మళ్లీ అధికారంలోకి రావాలని చూస్తున్న బీజేపీ, మెజార్టీ స్థానాలను  కైవసం చేసుకోవాలని ప్లాన్​చేస్తోంది. ఇప్పటికే పార్టీ ఆ దిశగా కసరత్తు షూరు చేసింది. ఉమ్మడి నిజామాబాద్ ​జిల్లా ముఖ్య నేతలతో పార్టీ స్టేట్​ఇన్​చార్జి సునీల్​బన్సల్​ సమావేశమయ్యారు. పార్లమెంట్​ఎన్నికల కోసం క్షేత్ర స్థాయిలో అనుసరించాల్సిన వ్యుహంపై దిశానిర్దేశం చేశారు. కేంద్ర ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ నెల 16 నుంచి వికసిత్ భారత్​సంకల్ప యాత్ర నిర్వహిస్తోంది. వచ్చే జనవరి 26 వరకు ఈ యాత్ర సాగనుంది. 2019లో పార్టీ తరఫున బాణాల లక్ష్మారెడ్డి పోటీ చేశారు.  

1,38,947 ఓట్లు వచ్చాయి. ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీకి ఓట్లు పెరగడంతో పాటు,  అయిదేండ్లలో గ్రామస్థాయిలోనూ పార్టీ బాగా పుంజుకుందని,ఈ సారి తమకు విజయావకాశాలు మెండుగా ఉన్నాయని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. 2018లో జిల్లాలోని 4 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 43,634 ఓట్లు రాగా, 2023లో 1,45,814 ఓట్లు వచ్చాయి.  కామారెడ్డి అసెంబ్లీలో బలమైన నేతలను ఎదుర్కొని బీజేపీ విజయం సాధించింది. టికెట్​ ఆశిస్తున్న నేతలు ఇప్పటికే దిల్లీ స్థాయిలో తమ ప్రయత్నాలు షురూ చేశారు.

సిట్టింగ్​స్థానం చేజారొద్దని బీఆర్ఎస్​

పార్లమెంట్​ఎన్నికల్లో అత్యధిక స్థానాల్లో గెలిచి అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమితో డీలా పడ్డ క్యాడర్​లో తిరిగి జోష్​ నింపాలని బీఆర్ఎస్​ ఆలోచిస్తోంది. జహీరాబాద్​ ఎంపీ స్థానం ప్రస్తుతం బీఆర్ఎస్​ ఖాతాలోనే ఉంది. 2014, 2019 ఎన్నికల్లో ఆ పార్టీ అభ్యర్థి బీబీ పాటిల్​ఇక్కడ విజయం సాధించారు.  2014లో బీఆర్ఎస్​కు 5,08,661 ఓట్లు వస్తే కాంగ్రెస్​కు 3,64,030 ఓట్లు వచ్చాయి. 2019లో బీఆర్ఎస్​కు 4,34,244 ఓట్లు, కాంగ్రెస్​కు 4,28, 015 ఓట్లు వచ్చాయి. బీఆర్ఎస్​ అభ్యర్థి కేవలం 6,229 ఓట్లతో గెలుపొందారు. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లోనూ జిల్లాలో బీఆర్ఎస్ ​కేవలం ఒక స్థానాన్నే నిలబెట్టుకుంది. బీఆర్ఎస్​ శ్రేణులు నియోజకవర్గాల్లో క్యాడర్​తో మీటింగ్​లు నిర్వహిస్తూ లోక్​సభ ఎన్నికలకు వారిని సన్నద్ధం చేస్తున్నారు.​

అధికార యంత్రాంగం కసరత్తు

అధికార యంత్రాంగం సైతం పార్లమెంట్​ఎన్నికల కోసం కసరత్తు ప్రారంభించింది. రాష్ట్ర ఎన్నికల కమిషనర్​ వికాస్​రాజ్​ ఇటీవల ఆయా జిల్లాల కలెక్టర్లతో   వీడియో కాన్ఫరెన్స్​నిర్వహించారు. ఎన్నికల సన్నద్ధత, ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియపై సూచనలు చేశారు. కామారెడ్డి కలెక్టర్​ జితేశ్​ వీ పాటిల్​ఇటీవల పొలిటీకల్​పార్టీల ప్రతినిధులతో మీటింగ్​ నిర్వహించారు. 2024 జనవరి 6న ముసాయిదా ఓటర్ల జాబితా రిలీజ్​చేయనున్నారు. జనవరి 22 వరకు అభ్యంతరాలు స్వీకరించి, ఫిబ్రవరి 8న ఫైనల్​ లిస్ట్​ వెల్లడించనున్నారు.