‘అఫ్గాన్‌ స్టార్‌ ’.. తాలిబన్లపై మ్యూజిక్‌ తో పోరాడతా

‘అఫ్గాన్‌ స్టార్‌ ’.. తాలిబన్లపై మ్యూజిక్‌ తో పోరాడతా

అఫ్గానిస్థాన్‌ లో మహిళలు బయటికి రావడమే తక్కువ.. అలాంటిది ఓఅమ్మాయి ‘అఫ్గాన్‌ స్టార్‌ ’ టీవీ సింగింగ్‌ కాంపిటిషన్‌ లో పాల్గొంది. 13 ఏళ్లుగా మగవాళ్లే గెలుస్తున్న పోటీలో 14వ సారి మహిళల సత్తా చాటింది. గెలిచి చూపించింది. అలాంటి అమ్మాయి అఫ్గానిస్థాన్‌ తాలిబన్లపై మ్యూజిక్‌ తో పోరాడతానని చెప్పింది. తన పేరు జెహ్రా ఎల్హం. వయసు 20 ఏళ్లు. అక్కడి హజారా జాతి మహిళ. పర్షియన్‌, హజారాఫోక్‌ పాటలు, తన స్వరంతో అఫ్గానీలను మెప్పించింది. తన కుటుంబంలో పాటలుపాడేవారెవరూ లేరంది. యూట్యూబ్‌ లోఆర్యన సయీద్‌ పాటలు చూసి నేర్చుకున్నానని చెప్పింది.

తన వల్ల మరింత మంది అఫ్గానీ మహిళలు ప్రేరణ పొందితే చాలా సంతోషిస్తానంది. రాజకీయాల్లోకి వెళ్లే ఉద్దేశమైతే లేదని స్పష్టం చేసింది. కానీ తాలిబన్లు అధికారంలోకి వస్తే మాత్రం మ్యూజిక్‌ తోనే వాళ్లతో పోరాడతానని చెప్పింది. తాలిబన్లు మహిళలను బయటకు రానివ్వరు. బుర్ఖా తప్పనిసరి. సంగీతం నిషేధం. 1996 నుంచి 2001లో వాళ్లను తరిమే వరకు అఫ్గాన్‌ లో ఇలాంటి పాలనే నడిచింది. అప్పటి నుంచివారు ఆ దేశంలో అఫ్గాన్‌ ప్రభుత్వం ,అమెరికా బలగాలపై దాడులు చేస్తున్నారు. ప్రస్తుతం యూఎస్‌‌, తాలిబన్ల మధ్య శాంతిచర్చలు జరుగుతున్నాయి.