టాయిలెట్స్ కోసం జైనథ్ జడ్పీ స్కూల్ విద్యార్థుల ధర్నా

ఆదిలాబాద్ జిల్లా: టాయిలెట్స్ లేక తీవ్ర ఇబ్బందిపడుతున్న జైనథ్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులు రోడ్డెక్కారు. స్కూల్ లో కనీస సౌకర్యాలు కల్పించడంతో పాటు ఇతర సమస్యలను పరిష్కరించాలంటూ విద్యార్థులు నిరసనకు దిగారు. ఎన్నిసార్లు అడిగినా సర్ది చెబుతున్నారే తప్ప తమ సమస్యలు పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. 

రోడ్డుపై బైఠాయించి నిరసన చేస్తున్న విద్యార్థులకు బీజేపీ నాయకురాలు సుహాసిని రెడ్డి మద్దతు తెలిపారు. అమ్మాయిలు టాయిలెట్లు లేక చదువు మానుకోవాల్సిన దుస్థితి ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. ఎమ్మెల్యేకు విద్యార్థులు మొరపెట్టుకున్నా ఉపయోగం లేకుండా పోయిందని విమర్శించారు. విద్యార్థుల ఆందోళనతో రోడ్డుపై భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. దీంతో విద్యార్థుల ఆందోళనకు మద్దతు తెలిపిన బీజేపీ నాయకులను పోలీసులు అరెస్ట్ చేశారు.