అనిశ్చితికి మారుపేరైన పాకిస్తాన్ క్రికెట్‍లో ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవరూ ఊహించలేం. ఒకవైపు గెలుపుకోసం ఆ జట్టు ఆటగాళ్లు గత 76 రోజులుగా శ్రమిస్తుంటే.. మరోవైపు స్వదేశంలో అనూహ్య పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. పాకిస్తాన్ క్రికెట్ బోర్డు(పీసీబీ) చైర్మన్ పదవికి జకా అష్రఫ్ రాజీనామా చేశారు. గతేడాది జూలై 6న పీసీబీ చైర్మన్‍గా బాధ్యతలు చేపట్టిన ఆయన.. కనీసం ఏడాది కూడా పూర్తవకుండానే ఆ పదవి నుంచి వైదొలిగారు.
శుక్రవారం(జనవరి 19) పాకిస్తాన్ క్రికెట్ బోర్డు మేనేజింగ్ కమిటీ సమావేశం జరగ్గా.. అది ముగిసిన వెంటనే జకా అష్రఫ్ తన రాజీనామా నిర్ణయాన్ని ప్రకటించారు. కాసేపట్లో మీటింగ్ ముగుస్తుందనంగా ఆయన తన రాజీనామా లేఖను తాత్కాలిక ప్రధాన మంత్రి అన్వర్ ఉల్ హక్ కకర్‌కు చేరవేశారు. పాక్ క్రికెట్‍ను బాగు చేయడానికి తాను ఎంత కష్టపడుతున్నా.. సరైన మద్దతు లభించకపోవడంతోనే ఆయన పీసీబీ చైర్మన్ పదవికి రాజీనామా చేశారన్నది ఆ దేశ మీడియా చెప్తున్న కథనం. గత కొంతకాలంగా ఆ జట్టు ప్రదర్శనపై కూడా ఆయన అసంతృప్తిగా ఉన్నట్లు సమాచారం.
Also Read : మీరొద్దు.. మీదేశమూ వద్దు: భార్యా పిల్లలతో కలిసి దేశాన్ని వీడిన పాక్ క్రికెటర్
అన్నింటా పరాజయాలే..!
జకా అష్రఫ్.. పీసీబీ చైర్మన్‌గా భాద్యతలు చేపట్టాక పాకిస్తాన్ జట్టు సాధించిన విజయాలే కంటే పరాజయాలే ఎక్కువ. గతేడాది హైబ్రిడ్ విధానంలో జరిగిన ఆసియా కప్ టోర్నీలో ఫైనల్ కూడా చేరలేకపోయిన పాక్.. ఏడాది చివరలో జరిగిన వన్డే ప్రపంచ కప్‍లో లీగ్ దశలోనే ఇంటిదారి పట్టింది. అనంతరం కొత్త ఏడాది ఆరంభంలో ఆస్ట్రేలియా చేతిలో 0-3 తేడాతోటెస్ట్ సిరీస్ కోల్పయింది.ఇప్పుడు కివీస్ పర్యటనలోనూ న్యూజిలాండ్ చేతిలో 0-4 తేడాతో టీ20 సిరీస్‌లో వెనుకబడింది. జకా అష్రఫ్ రాజీనామాకు ఈ ప్రదర్సన కూడా ఒక కారణమన్న టాక్ వినపడుతోంది.