సినిమాలకి తీసిపోకుండా వెబ్ సిరీసులు తెరకెక్కుతూ ఉండటంతో అందరూ వాటిపై దృష్టి పెడుతున్నారు. పాపులర్ యాక్టర్లు సైతం వాటిలో నటించేందుకు సిద్ధపడుతున్నారు. దాంతో రోజుకో ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ మొదలవుతోంది. తాజాగా మరో కొత్త సిరీస్ స్టార్టయ్యింది. లావణ్య త్రిపాఠి, ఆది సాయికుమార్ లీడ్ రోల్స్‌లో నటిస్తున్న ఈ సిరీస్‌కి ‘పులి–మేక’ అనే టైటిల్‌ను ఫిక్స్ చేశారు. సుమన్, సిరి, అవినాష్ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. కోన వెంకట్, వెంకటేష్ కిలారు కథ అందించారు. కె.చక్రవర్తి రెడ్డి దర్శకుడు. నిన్న హైదరాబాద్‌లో పూజా కార్యక్రమాలతో ఈ సిరీస్ మొదలైంది. ఫస్ట్ షాట్‌కి దర్శకుడు బాబి క్లాప్ కొట్టారు.
మరో డైరెక్టర్ అనిల్ రావిపూడి కెమెరా స్విచాన్ చేశారు. అనంతరం నిర్మాతలు మాట్లాడుతూ ‘పోలీస్ డిపార్ట్‌మెంట్ చుట్టూ తిరిగే థ్రిల్లర్. పోలీసుల్ని టార్గెట్ చేసి ఒకరి తర్వాత ఒకర్ని చంపుతుంటాడు ఒక సీరియల్ కిల్లర్. అలా ఎందుకు చేస్తున్నాడు, అతన్ని ఎలా పట్టుకున్నారు అనేది మిగతా కథ’ అని చెప్పారు. ఆది, లావణ్యలు ఎలాంటి పాత్రలు పోషిస్తున్నారనేది తెలియాల్సి ఉంది. ఇదిలా ఉంటే ఆది సాయికుమార్, పాయల్ రాజ్‌పుత్ జంటగా నటిస్తున్న ‘తీస్‌మార్ ఖాన్’ మూవీ టీజర్‌నిన్న రిలీజయ్యింది. ఆది పోలీసాఫీసర్‌గా నటిస్తున్న ఈ చిత్రాన్ని కళ్యాణ్‌జీ గోగన దర్శకత్వంలో నాగం తిరుపతిరెడ్డి నిర్మిస్తున్నారు