జెలెన్ స్కీ ఓ దుష్టుడు.. యుద్ధాన్ని పొడిగించాలని అనుకుంటున్నడు: ఎలాన్​మస్క్

జెలెన్ స్కీ ఓ దుష్టుడు.. యుద్ధాన్ని పొడిగించాలని అనుకుంటున్నడు: ఎలాన్​మస్క్

వాషింగ్టన్: ఉక్రెయిన్​ అధ్యక్షడు జెలెన్ స్కీ ఓ దుష్టుడని.. యుద్ధాన్ని మరింత పొడిగించాలని అనుకుంటున్నాడని బిలియనీర్ ఎలాన్​ మస్క్ ​మండిపడ్డారు. ఉక్రెయిన్‌‌-, రష్యా యుద్ధం ముగింపుపై చర్చించేందుకు ఆదివారం లండన్‌‌లో ఐరోపా దేశాధినేతల సమావేశం జరిగింది. ఇందులో పాల్గొన్న జెలెన్‌‌స్కీ.. సమావేశం అనంతరం ఓ వీడియో మెసేజ్​ రిలీజ్ ​చేశారు. 

రష్యాతో యుద్ధం మరింత సుదీర్ఘంగా కొనసాగుతుందని అన్నారు. అప్పటిదాకా అమెరికా సహకారం తమకు అందుతుందనే ఆశాభావం వ్యక్తంచేశారు. ఆ దేశంతో డీల్‌‌కు తాను సిద్ధమేనని, ట్రంప్‌‌తో భేటీకి సిద్ధంగానే ఉన్నానని అన్నారు. కాగా, ఈ ప్రకటనపై అమెరికా ప్రెసిడెంట్​ట్రంప్​ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. అదో చెత్త ప్రకటన అని, యుద్ధాన్ని అమెరికా ఎంతో కాలం కొనసాగనీయదని ట్రూత్​ సోషల్ ​వేదికగా విమర్శించారు. 

కాగా, ట్రంప్ ​పోస్ట్‌‌ పై ఎలాన్​ మస్క్​ స్పందించారు. జెలెన్​ స్కీపై తరచూ విమర్శలు గుప్పించే మస్క్.. గతంలోనూ ఒక ప్రత్యేక పోస్ట్‌‌లో ఉక్రెయిన్ అధ్యక్షుడు శాంతిని కోరుకోవడం లేదని ఆరోపించారు. "రెండు సంవత్సరాల క్రితం నేను ఏం చెప్పానంటే.. ఉక్రెయిన్ శాంతిని కోరుకోవాలి లేదా తీవ్ర ప్రాణనష్టాన్ని చవిచూడాల్సి వస్తుంది. ఇందులో రెండోది జెలెన్​ స్కీ ఎంపిక. ఇప్పుడు కూడా మళ్లీ అదే చేయాలనుకుంటున్నాడు. ఇది క్రూరం, 
అమానవీయం" అని ఆయన రాసుకొచ్చారు.