కీవ్: రష్యా, ఉక్రెయిన్ మధ్య యుద్ధం రోజురోజుకీ తీవ్రమవుతోంది. ఉక్రెయిన్ లోని ప్రధాన నగరాలను లక్ష్యంగా చేసుకుని రష్యన్ బలగాలు మిసైళ్లతో విరుచుకుపడుతున్నాయి. ఉక్రెయిన్ సైనికులు కూడా వెనక్కి తగ్గకుండా దీటుగా పోరాడుతున్నారు. ఈ నేపథ్యంలో రష్యాకు భయపడి ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలొడిమిర్ జెలెన్స్కీ పారిపోయారనే వార్తలు వస్తున్నాయి. ఈ విషయంపై ఆయన స్పందించారు. తాను ఎక్కడికీ పారిపోలేదని.. రాజధాని కీవ్ సిటీలోనే ఉన్నానని స్పష్టం చేశారు. ఈ మేరకు కీవ్ లోని తన ఆఫీసులో తీసిన ఓ వీడియోను ఆయన సోషల్ మీడియాలో షేర్ చేశారు.
‘నేను కీవ్ లోనే ఉన్నా. ఇక్కడే ఉండి నా బాధ్యతలు నిర్వర్తిస్తున్నా. నేను చేయాల్సిన పనులు చేస్తున్నా. ఎవ్వరూ పారిపోలేదు’ అని జెలెన్స్కీ పేర్కొన్నారు. కాగా, జెలెన్స్కీ ఉక్రెయిన్ వదిలి పోలండ్ కు పారిపోయారని రష్యన్ నేత వ్యాచెస్లావ్ వొలొడిన్ కామెంట్ చేశారు. ఉక్రెయిన్ పార్లమెంట్ నాయకులకు జెలెన్స్కీ అందుబాటులో లేకుండా పోయారని వ్యాఖ్యానించారు. మరోవైపు మార్చి 2న ఉక్రెయిన్ పార్లమెంట్ నిర్వహించిన సీక్రెట్ మీటింగ్ లో జెలెన్స్కీ పాల్గొనలేదని.. రష్యన్ అటాక్స్ కు భయపడి, ఆయన ఉక్రెయిన్ విడిచి వెళ్లారని మీడియాలో పలు కథనాలు వచ్చాయి. ఈ నేపథ్యంలో జెలెన్స్కీ తాను కీవ్ లోనే ఉన్నానని తాజాగా వీడియో పోస్టు చేయడం గమనార్హం.
మరిన్ని వార్తల కోసం: