ఉక్రెయిన్ ను ఒంటరిని చేయొద్దని ఆ దేశ అధ్యక్షుడు జెలెన్స్కీ మరోసారి యూరోపియన్ యూనియన్ (ఈయూ) దేశాలను రిక్వెస్ట్ చేశారు. రష్యా దురాక్రమణను ఆరు రోజులుగా నిలువరించి తమ శక్తిని రుజువు చేసుకున్నామని, తాము కూడా యూరోపియన్ యూనియన్ లోని దేశాలతో సమానమైన వాళ్లమేనని గుర్తించాలని అన్నారు. మంగళవారం మధ్యాహ్నం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఆయన ఈయూ పార్లమెంట్ లో ప్రసంగించారు. జెలెన్స్కీ ఎమోషనల్ గా చేసిన ప్రసంగానికి యూరోపియన్ యూనియన్ ప్రతినిధులంతా చలించిపోయారు. ఆయన మాట్లాడడం పూర్తవగానే అందరూ లేని నిలబడి.. చప్పట్లతో తమ సంఘీభావం తెలిపారు.
#WATCH | Ukraine President Volodymyr Zelenskyy received thunderous applause after concluding his remarks at EU meeting, said, "We are also fighting to be equal members of Europe. Without EU Ukraine is going to be lonesome. Do prove that you are with us & will not let us go." pic.twitter.com/49WtnQT6MP
— ANI (@ANI) March 1, 2022
మీరు లేకుంటే ఒంటరైపోతాం
‘‘మీరు (ఈయూ) వదిలేస్తే మేం ఒంటరైపోతాం. ఇప్పటి వరకు మా శక్తిని నిరూపించుకున్నాం. మేం కూడా మీతో సామానమే. ఇప్పుడు మీరు కూడా మాకు అండగా నిలుస్తారని ప్రూవ్ చేసుకోండి. మమ్మల్ని గాలికి వదిలేయరని రుజువు చేసుకోండి’’ అని ఉక్రెయిన్ ప్రెసిడెంట్ జెలెన్స్కీ అన్నారు. ఉక్రెయిన్ కు యూరోపియన్ యూనియన్ లో సభ్యత్వం ఇవ్వాలని డిమాండ్ చేశారు.
మాతృభూమి కోసం పోరాడుతున్నాం
‘‘మాతృభూమిని కాపాడుకోవడం కోసం మేం పోరాడుతున్నాం. ఉక్రెయిన్ లోని అన్ని సిటీలనూ (రష్యా) బ్లాక్ చేసినా.. మేం వెనుకడుగేయకుండా స్వేచ్ఛ కోసం పోరాటం చేస్తూనే ఉన్నాం. మేం ఉక్రెయిన్ ప్రజలం.. మేమంతా బలవంతులం. మమ్మల్ని ఎవరూ అణచివేయలేరు’’ అని జెలెన్స్కీ అన్నారు.
ఉక్రెయిన్ జెండాలతో మద్దతు..
జెలెన్స్కీ ప్రసంగం ముగిసిన తర్వాత ఈయూ చట్టసభ్యులంతా ఒక్కసారిగా లేచి నిలబడి చప్పట్లు కొడుతూ ఉక్రెయిన్ కు సంఘీభావం తెలిపారు. కొందరు సభ్యులైతే ఉక్రెయిన్ జెండాలు ఉన్న టీషర్టులతో సభకు వచ్చి తమ మద్దతును తెలిపారు.