ట్రంప్, జెలెన్ స్కీ మధ్య మాటల యుద్ధం

ట్రంప్, జెలెన్ స్కీ మధ్య మాటల యుద్ధం
  • వైట్​హౌస్​లో టెన్షన్ టెన్షన్
  • ట్రంప్, జెలెన్ స్కీ మధ్య మాటల యుద్ధం
  • ఓ దశలో అరుచుకున్న అమెరికా, ఉక్రెయిన్​ దేశాధినేతలు
  • తమతో మినరల్స్​డీల్​కు ఒప్పుకోవాలని ట్రంప్​ ఒత్తిడి
  • తమ భవిష్యత్తుకు గ్యారెంటీ కావాలన్న జెలెన్ స్కీ

వాషింగ్టన్​ డీసీ:అమెరికాతో మినరల్స్ డీల్​కు ఒప్పుకోకుంటే ఉక్రెయిన్ విషయంలో ఇకపై కలగజేసుకోబోమని ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్​ఉక్రెయిన్ జెలెన్ స్కీకి స్పష్టం చేశారు. రష్యాతోనూ రాజీ పడాలని తేల్చిచెప్పారు. మినరల్స్ డీల్​కు ఒప్పుకుంటావా లేదా అంటూ నిలదీశారు. అమెరికా అధ్యక్ష భవనం వైట్​హౌస్​లోని ఓవల్​ఆఫీసులో శుక్రవారం జరిగిన ఇరు దేశాధినేతల భేటీలో ట్రంప్​ఈ కామెంట్స్ చేశారు. 

దేశాధినేతల భేటీలో కనిపించే హుందాతనం ఏదీ ఈ సమావేశంలో కనిపించలేదు. అంతర్జాతీయ మీడియా ప్రతినిధుల సమక్షంలో ట్రంప్, జెలెన్ స్కీ మధ్య మాటల యుద్ధమే నడిచింది. ఓ దశలో గట్టిగట్టిగా అరుచుకునే వరకూ వెళ్లింది. మినరల్స్ డీల్ పై సంతకం చేస్తే సరి లేదంటే తాము తప్పుకుంటామని ట్రంప్ హెచ్చరించగా.. ఉక్రెయిన్ భవిష్యత్తు సంగతేంటని జెలెన్ స్కీ ప్రశ్నించారు. 

భవిష్యత్తులో తమపై దాడులు జరగవనే భరోసా కల్పించాలని డిమాండ్ చేశారు. దీంతో ట్రంప్ సీరియస్ గా స్పందిస్తూ.. ‘నువ్వు చాలా పెద్ద సమస్యలో ఉన్నావు. ఇది నువ్వు గెలువలేవు’ అన్నారు. జెలెన్ స్కీ కూడా అదే స్థాయిలో దీనికి బదులిచ్చారు. ‘మేం మా సొంత దేశంలో ఉన్నాం. ఎవరి జోలికీ వెళ్లలేదు. మాపై జరిగిన దురాక్రమణను ధైర్యంగా ఎదురించి నిలబడ్డాం. మీరు (అమెరికా) అందించిన సాయానికి కృతజ్ఞతలు కూడా చెప్పాం’ అని అన్నారు. 

దీంతో ట్రంప్ చిరాకు వ్యక్తం చేస్తూ.. ఇలాగైతే ఒప్పందం కుదరడం కష్టమేనని పెదవి విరిచారు. లక్షలాది మంది ప్రజల ప్రాణాలతో జూదం ఆడుతున్నావు, మూడో ప్రపంచ యుద్ధంతో జూదమాడుతున్నావు, మా దేశానికి అవమానకరంగా మాట్లాడుతున్నావంటూ జెలెన్ స్కీపై ట్రంప్ తీవ్ర ఆరోపణలు చేశారు. ఈ క్రమంలో ఇరువురు నేతలు గట్టిగా మాట్లాడడం ఓవల్ ఆఫీసులో ఉద్రిక్తతను పెంచింది. 

అదేసమయంలో వైస్ ప్రెసిడెంట్ జేడీ వాన్స్ కలగజేసుకుంటూ.. యుద్ధాన్ని ముగించాలంటే కొంత డిప్లొమసీ అవసరమని జెలెన్ స్కీకి హితవు పలికారు. దీనికి జెలెన్ స్కీ వెంటనే రియాక్టవుతూ ఎలాంటి డిప్లొమసీ అని నిలదీశారు. గట్టిగా మాట్లాడొద్దని జేడీ వాన్స్ కు సూచించారు. దీంతో అమెరికా ప్రెసిడెంట్ భవనాన్ని అవమానిస్తున్నారంటూ జెలెన్ స్కీని వాన్స్ విమర్శించారు.

మా సాయం లేకుంటే యుద్ధం ఎప్పుడో ముగిసేది..

‘మేం మీకు 350 బిలియన్ డాలర్లు ఇచ్చాం. సైనిక సామగ్రి, ఆయుధాలు సమకూర్చాం. అందుకే ఇన్నాళ్లు పోరాడారు. మేం కనుక ఈ సాయం చేయకుంటే, అమెరికా ఆయుధాలు లేకుంటే యుద్ధం కేవలం రెండు వారాల్లో ముగిసిపోయి ఉండేది’ అంటూ జెలెన్ స్కీతో ట్రంప్​అన్నారు. దీనికి అంతే వేగంగా స్పందిస్తూ.. అవునవును, యుద్దం రెండు రోజులు కూడా జరిగేది కాదు. 

ఈ మాట పుతిన్ నోటివెంట రావడం నేను కూడా విన్నానంటూ జెలెన్ స్కీ జవాబిచ్చారు. జెలెన్ స్కీ జవాబుతో సర్ ప్రైజ్ అయిన ట్రంప్.. మీటింగ్ సరిగ్గా సాగడంలేదని, బిజినెస్ డీల్ కుదుర్చుకునే పద్ధతి ఇది కాదంటూ మౌనాన్ని ఆశ్రయించాడు. కాగా, ఈ భేటీలో ఎలాంటి ఒప్పందం కుదరలేదని అమెరికా అధికార వర్గాల సమాచారం. కాల్పుల విరమణకు, శాంతి ఒప్పందానికి ఎప్పుడు సిద్ధమైతే అప్పుడు జెలెన్ స్కీకి మళ్లీ స్వాగతం పలుకుతామంటూ ట్రంప్ తన సోషల్ మీడియా ప్లాట్​ఫాంలో పోస్ట్ పెట్టారు.