- విన్నింగ్ బిడ్లు ప్రకటించక ముందే కాంటాలు
- పీవోఎస్ మిషన్ ప్రింట్ ఇయ్యట్లే
- లెక్కకు చిక్కకుండా వందల బస్తాలు మళ్లింపు
- వాటాలందుతున్నాయని ఆరోపణలు
ఖమ్మం, వెలుగు: ఖమ్మం వ్యవసాయ మార్కెట్లో జోరుగా జీరో దందా సాగుతోంది. ప్రతి రోజూ వేల బస్తాల పత్తిని మార్కెట్ రికార్డుల్లో ఎంటర్ చేయకుండా దారి మళ్లిస్తున్నారు. సీజన్ ప్రారంభం కావడంతో దాదాపు 20 రోజుల నుంచి మార్కెట్ కు రైతులు పత్తిని తీసుకువస్తున్నారు. రెండ్రోజుల కింద ఈ సీజన్లోనే అత్యధికంగా 20 వేల బస్తాల పత్తి మార్కెట్ కు వచ్చింది. ఇందులో 4 వేల బస్తాల పత్తిని ఆన్ లైన్ చేయకుండానే మార్కెట్ గేట్ దాటించినట్లు ఆరోపణలున్నాయి. రెగ్యులర్ గా ఇలాగే కొన్ని వేల బస్తాలు ఈ- నామ్ ప్రకారం ఆన్లైన్ లో ఎంటర్ చేయకుండానే సైడ్ చేస్తున్నారు. మార్కెట్ సెస్ చెల్లించకుండా తప్పించుకోవడంతో పాటు, సేల్ ట్యాక్స్(జీఎస్టీ)ని ఎగ్గొడుతున్నారు.
దందా జరుగుతోందిలా..
మార్కెట్ కు పత్తిని తీసుకువచ్చిన రైతులు ఒక కమీషన్‌దారుడి ద్వారా ఆ పంటను అమ్ముకుంటారు. పత్తిని పరిశీలించిన తర్వాత వ్యాపారులు ఈ-నామ్ రూల్స్ ప్రకారం ఆన్ లైన్లో బిడ్డింగ్ వేయాల్సి ఉంటుంది. సక్సెస్ ఫుల్ బిడ్డర్లు ఆ పంటను కాంటా వేసుకొని తీసుకుంటారు. అయితే కాంటాలు జరిగే సమయంలో విన్నింగ్ బిడ్డర్ లిస్ట్ రాకముందే కొంత మంది వ్యాపారులు పత్తి కాంటా చేస్తున్నారు. ఈ సమయంలో ఎలక్ట్రానిక్ వేయింగ్ మిషన్లకు పీవోఎస్ మిషన్లను జత చేసి కాంటా పూర్తయిన తర్వాత దాని నుంచి ప్రింట్ తీసి రైతులకు ఇస్తే ఆటోమెటిక్‌గా ఆ పంట వివరాలు ఆన్లైన్లో ఎంటర్ అవుతాయి. కానీ రైతులకు ప్రింటెడ్ స్లిప్ ఇవ్వకుండా కాంటా పూర్తి కాగానే వివరాలను అప్ లోడ్ చేయడం లేదు. ఇలా మేనేజ్ చేసినందుకు బస్తాకు రూ.20 చొప్పున ఆఫీసర్లు, సిబ్బందికి, ఇతర బాధ్యులకు వాటాలు ముడుతున్నట్లు చెబుతున్నారు. ఇక దడువాయికి ఇచ్చేందుకు ఒక బస్తాకి రూ.4 చొప్పున రైతుల నుంచి కట్ చేస్తున్నారు. ఆన్ లైన్లో నమోదు కాకుండా మేనేజ్ చేసిన బస్తాలకు అదనంగా రూ.2 చొప్పున చెల్లిస్తున్నట్టు తెలుస్తోంది.
సహకరిస్తే తప్పేముంది..
ఈ జీరో దందా గురించి వ్యవసాయ మార్కెట్ కు సంబంధించిన ఓ అధికారి దగ్గర ప్రస్తావిస్తే, కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన మద్దతు ధర కంటే రైతులకు ఎక్కువ రేటు ఇచ్చి పంటను కొంటున్న వ్యాపారులకు ఆ మాత్రం సహకరించాలి కదా అని అనడం గమనార్హం. అయితే మార్కెట్ అధికారులు మాత్రం ఎప్పటిలాగానే మార్కెట్ లో జీరో దందా విషయం తమ దృష్టికి రాలేదని చెబుతున్నారు. ప్రతి రైతుకు ఆన్ లైన్ రిసిప్ట్ ఇవ్వాలని, అలా కాంటా బిల్లు ఇవ్వని వ్యాపారులపై చర్యలు తీసుకుంటామని అంటున్నారు.
ఎలక్ట్రానిక్ బిల్లు ఇయ్యలే
ఖమ్మం మార్కెట్ కు 21 బస్తాల పత్తి తీసుకువచ్చాను. క్వింటా రూ.7300 చొప్పున రేటు పడింది. కాంటా పూర్తయిన తర్వాత నాకు ఎలాంటి కంప్యూటర్ బిల్లు ఇయ్యలేదు. పేపర్ పైనే బస్తాల చొప్పున తూకం రాసుకున్నాను.
- కేలోత్ నాగేశ్వరరావు,
పేరేపల్లి, కారేపల్లి మండలం