Asia Junior Championships: బ్యాడ్మింటన్‌లో విషాదం.. మ్యాచ్ ఆడుతూనే కుప్పకూలి చనిపోయిన చైనా ప్లేయర్

Asia Junior Championships: బ్యాడ్మింటన్‌లో విషాదం.. మ్యాచ్ ఆడుతూనే కుప్పకూలి చనిపోయిన చైనా ప్లేయర్

బ్యాడ్మింటన్‌లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. చైనాకు చెందిన బ్యాడ్మింటన్ ప్లేయర్ మ్యాచ్ ఆడుతూ మరణించడం షాక్ కు గురి చేస్తుంది. యోగ్యకార్తాలో జరుగుతున్న ఆసియా జూనియర్ ఛాంపియన్‌షిప్‌లో జాంగ్ జిజీ అకస్మాత్తుగా అస్వస్థతకు గురయ్యాడు. జపాన్‌కు చెందిన కజుమా కవానోతో మ్యాచ్ ఆడుతున్నప్పుడు ఆదివారం (జూన్ 30) అర్థరాత్రి ఈ సంఘటన జరిగింది. 

మొదటి గేమ్‌లో స్కోరు 11-11 తో సమంగా ఉన్న సమయంలో జాంగ్ నేలపై పడిపోయాడు. దీంతో అక్కడే అతనికి చికిత్స అందించి     అంబులెన్స్‌లో హాస్పిటల్ కు తీసుకెళ్లాడు. అయితే అతన్ని బ్రతికించడానికి చేసిన ప్రయత్నాలు మాత్రం విఫలమయ్యాయి. అతను చికిత్స తీసుకుంటుండగా మరణించాడు. మృతికి గల కారణాలు తెలియాల్సి ఉంది. ఆదివారం రాత్రి 11:20 గంటలకు అతను మరణించాడని తెలుస్తుంది. జాంగ్ జిజీ వయసు కేవలం 17 సంవత్సరాలే కావడం విచారానికి గురి చేస్తుంది.   

అతను అత్యుత్తమ ఆటగాడని.. అద్భుతమైన ప్రతిభ అతని సొంతం అని అధికారులు అతని మృతికి సంతాపం తెలిపారు. ఈ ఏడాది ప్రారంభంలో జాంగ్ జిజీ డచ్ జూనియర్ ఇంటర్నేషనల్ ప్రతిష్టాత్మక యూత్ టోర్నమెంట్‌లో సింగిల్స్ టైటిల్‌ను గెలుచుకున్నాడు. జాంగ్ కుటుంబానికి భారత స్టార్ ప్లేయర్ పీవీ సింధు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నానని తన ఎక్స్ లో రాసుకొచ్చింది.