ఫుణెలో తండ్రీకూతుళ్లకు జికా వైరస్

ఫుణెలో తండ్రీకూతుళ్లకు జికా వైరస్

ఫుణె: మహారాష్ట్రలోని ఫుణె సిటీలో జికా వైరస్ కలకలం రేపింది. ఓ డాక్టర్ తో పాటు ఆయన కూతురు ఈ వైరస్ కు పాజిటివ్ గా తేలారు. అయితే, వారి ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని అధికారులు తెలిపారు. ఫుణెకు చెందిన ఓ డాక్టర్ ఇటీవల అస్వస్థతకు గురయ్యారు. జ్వరం, దద్దుర్లు వంటి లక్షణాలతో ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేరారు. ఆయన బ్లడ్ శాంపిల్స్ ను కలెక్ట్ చేసిన మెడికల్ అధికారులు విశ్లేషణ కోసం సిటీలోనే ఉన్న నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్​ వైరాలజీ (ఎన్ఐవీ)కి పంపించారు.

 జూన్ 21న ఆయన జికా వైరస్ కు పాజిటివ్ గా తేలారు. దీంతో ఫుణె మెడికల్ కార్పొరేషన్ అధికారులు వెంటనే అప్రమత్తమై అతడి కుటుంబ సభ్యుల బ్లడ్ శాంపిల్స్​ను కలెక్ట్ చేసి పరీక్షలు నిర్వహించారు. ఈ క్రమంలోనే అతడి 15 ఏండ్ల కూతురికి కూడా వైరస్ నిర్ధారణ అయింది. ఒకే ఇంట్లో రెండు కేసులు నమోదు కావడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. ముందు జాగ్రత్తగా ఆ ప్రాంతంలో వైరస్‌‌‌‌‌‌‌‌ వ్యాప్తి నివారణ చర్యలు చేపట్టారు.