- ఒక్కొ జడ్పీటీసీకి రూ. 70 లక్షల నిధులు
- స్థానిక సంస్థలకు అందని సరైన ఫండ్స్
- నేటితో ముగుస్తున్న జడ్పీ పాలకవర్గం
సిద్దిపేట, వెలుగు : సిద్దిపేట జిల్లా పరిషత్ తొలి పాలకవర్గం గడువు ఈనెల 4 వ తేదీతో ముగుస్తోంది. జిల్లా ఏర్పడిన తర్వాత కొలువుదీరిన ఈ పాలక వర్గానికి అప్పటి ప్రభుత్వం సరిగ్గా నిధులు అందించలేకపోయిందని జడ్పీటీసీలు, ఎంపీటీసీలు అంటున్నారు. ఐదేండ్ల పాటు నిధుల కొరత వెంటాడిందని చెడుతున్నారు. పాలనా సౌలభ్యం కోసం సిద్దిపేటను జిల్లాగా ఏర్పాటు చేసినా.. జడ్పీ నిధులు మాత్రం అరాకొరాగానే అందించిందన్న విమర్శలు ఉన్నాయి. గత ఐదేండ్ల కాలంలో అభివృద్ధి పనుల కోసం కేవలం రూ. 20.35 కోట్లు మాత్రమే జడ్పీకి అందాయి.
2019 జూన్ 5న సిద్దిపేట జిల్లా పరిషత్ తొలి పాలక వర్గం కొలువుదీరింది. తొలి ఎన్నికల్లో మొత్తం 23 జడ్పీటీసీ స్థానాల్లో బీఆర్ఎస్ 22 గెలుచుకోగా ఒకే ఒక స్థానంలో కాంగ్రెస్ అభ్యర్థి గెలిచారు. బీఆర్ఎస్ కే మెజార్టీ దక్కడంతో చిన్నకోడూరు జడ్పీటీసీ వేలేటీ రోజా శర్మ జిల్లా పరిషత్ తొలి చైర్ పర్సన్ గా ఎన్నికయ్యారు. 2019 జూలై 5న వేలేటీ రోజా శర్మ పదవి స్వీకరించారు.
ఐదేండ్ల కాలంలో 20 సర్వ సభ్య సమావేశాలు జరిగాయి. గజ్వేల్ ఎమ్మెల్యేగా ఉన్న మాజీ సీఎం కేసీఆర్ గత ఐదేండ్ల కాలంలో ఎన్నడు జిల్లా పరిషత్ సమావేశాలకు హాజరు కాలేదు. గత పాలకవర్గంలోని తొగుట జడ్పీటీసీ ఇంద్రసేనారెడ్డి అనారోగ్యంతో మృతి చెందగా, చేర్యాల జడ్పీటీసీ మల్లేశం హత్యకు గురవడంతో ఈరెండు స్థానాలు ఖాళీ అయ్యాయి.
జడ్పీటీసీలకు రూ. 70 లక్షల నిధులు
గత ఐదేండ్ల జిల్లాకు మొత్తం 20.40 కోట్ల నిధులు మంజూరు కాగా వాటిలోంచి ఒక్కో జడ్పీటీసీకి రూ. 70 లక్షల నిధులు కేటాయించారు. వారి పరిధిలో వివిధ అభివృద్ధి పనులు చేపట్టారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 15 వ ఫైనాన్స్ కమిషన్ కు నుంచి దాదాపు రెండు కోట్ల నిధులు విడుదల కావాల్సివుండగా.. పనుల ప్రపోజల్స్ అధికారులు పూర్తి చేశారు.
పలు మండలాల్లో పీహెచ్సీ, అదనపు తరగతి గదులతో పాటు ఇతర అభివృద్ధి పనులు పూర్తయినా ప్రారంభోత్సవాలు పెండింగ్ లో పడ్డాయి. సరైన నిధులు లేకపోయినా ప్రభుత్వ పరంగా అమలు చేసిన మన ఊరు మనబడి, హరితహారం, ఈజీఎస్ పథకాల ద్వారా వచ్చిన పనులతో గ్రామాల్లో అభివృద్ది చేశారే తప్ప .. జడ్పీ నుంచి ఆశించిన మేర ప్రత్యేక నిధులు అంద లేదు. ప్రధాన ప్రభుత్వ శాఖలను జిల్లా పరిషత్ ల పరిధి నుంచి తప్పించడం వల్ల అటు అధికారాలు, ఇటు నిధులు లేక జడ్పీలు నామమాత్రంగా మారాయని సభ్యులు వాపోతున్నారు.
ఆశించిన మేర అందని నిధులు
సిద్దిపేట తొలి జిల్లా పరిషత్ కు గత ప్రభుత్వ హయాంలో ఆశించిన మేర నిధులు అందలేదు. జనరల్ ఫండ్, 15 ఫైనాన్స్ కమిషన్, మ్యాచింగ్ గ్రాంట్, స్పెషల్ మ్యాచింగ్ గ్రాంట్ల కింద వచ్చిన 20.40 కోట్ల నిధులు తప్ప ప్రభుత్వం ప్రత్యేకంగా ఎలాంటి నిధులను మంజూరు చేయలేదు. గత ఐదేండ్ల కాలంలో వివిధ రకాల సెస్సుల ద్వారా రావాల్సిన నిధులు అందలేదు.
ఆ ప్రభావం అభివృద్ది పనుల పై పడిందని జడ్పీటీసీలు, ఎంపీటీసీలు అంటున్నారు. ముఖ్యంగా స్థానిక సంస్థలకు రావాల్సిన స్టాంప్ డ్యూటీ, మైనింగ్ సెస్, వినోదపు పన్నులతో పాటు జనాభాను బట్టి తలసరి గ్రాంట్ లు సరైన విధంగా రాకపోవడంతో నిధుల కొరత ఏర్పడింది. నిధులు లేకపోవడంతో స్థానిక సంస్థల ప్రతినిధులకు ప్రాధాన్యం లేకపోయిందని ఆవేదన చెందారు. ఉమ్మడి జిల్లాలుగా ఉన్న సందర్భంలో సమృద్ధిగా నిధులుండగా చిన్న జిల్లాలు ఏర్పాటైన తరువాత అవసరాలకు అనుగుణంగా నిధులు మాత్రం మంజూరు కాకపోవడం లేదన్నారు.
ఐదేండ్ల పాలన సంతృప్తికరం
సిద్దిపేట జిల్లా తొలి జడ్పీ చైర్ పర్సన్ గా ఐదేండ్ల పాలన సంతృప్తికరంగా సాగింది. జిల్లాలోని వంద శాతం ప్రభుత్వ పాఠశాలల్లో తాగునీటి సౌకర్యం కల్పించడం, యోగా శిక్షణా తరగతులతో పాటు అదనపు తరగతి గదులను ఎక్కువ ప్రారంభించడం సంతోషాన్నిచ్చింది. గ్రామాల్లో మౌలిక వసతుల కల్పన కు ప్రాధాన్యత నిచ్చి అవసరమైన పనులు నిర్వహించినా నిధుల కొరత వల్ల కొన్ని ఇబ్బందులు ఏర్పడినా అందరి సహకారంతో ఐదేండ్ల కాలంలో ఇతర జిల్లాలతో పొలిస్తే సిద్దిపేట జిల్లాలో ఆశించిన మేర అభివృద్ధి జరిగిందని భావిస్తున్నాను.
వేలేటీ రోజా శర్మ, జడ్పీ చైర్ పర్సన్