![భద్రాద్రికొత్తగూడెం జిల్లాలో మహిళా ఓటర్లే ఎక్కువ](https://static.v6velugu.com/uploads/2025/02/zilla-praja-parishad-officers-are-preparing-for-zptc-and-mptc-elections-in-bhadradri-kothagudem-district_s4jGYEPzVI.jpg)
- జిల్లాలో లోకల్ బాడీ ఎన్నికల ఓటర్లు 6,81,174 మంది
- అత్యధికంగా బూర్గంపహడ్ మండలంలో 50,420 మంది
- ఆళ్లపల్లి మండలంలో అతి తక్కువగా 9,285 మంది ఓటర్లు
- 236 ఎంపీటీసీలకు 1,253పోలింగ్ స్టేషన్లు
- సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలపై పోలీస్‌ల ఫోకస్
భద్రాద్రికొత్తగూడెం, వెలుగు : జిల్లాలో జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలకు జిల్లా ప్రజాపరిషత్ ఆఫీసర్లు సిద్ధమవుతున్నారు. ఎంపీటీసీ ఎన్నికల ఓటర్ల ముసాయిదా జాబితాను జిల్లా ప్రజా పరిషత్ ఆఫీసర్లు సోమవారం ప్రకటించారు. జిల్లాలో 6,81,174 మంది ఓటర్లు జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. పురుషుల కంటే 18,480 మంది మహిళా ఓటర్లు ఎక్కువగా ఉన్నారు. బూర్గంపహడ్ మండలంలో అత్యధికంగా 50,420 మంది ఓటర్లు ఉన్నారు. ఆళ్లపల్లి మండలంలో అతి తక్కువగా 9,285 మంది ఓటర్లు నమోదు అయ్యారు.
మొత్తం 1253 పోలింగ్ కేంద్రాలు
జిల్లాలో 22 జడ్పీటీసీ, 236 ఎంపీటీసీ స్థానాలకు 1,253పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. 3,31,336 మంది పురుషులు 3,49,816 మంది మహిళా ఓటర్లు, 22 మంది థర్డ్ జెండర్ ఓటర్లున్నారు . ఓటర్ల జాబితాలను మండల ప్రజా పరిషత్ ఆఫీస్‌లలో అందుబాటులో ఉంచారు. జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు ఏ క్షణంలో జరిగినా అందుకు తగ్గట్టుగా సిద్దంగా ఉండాలని రాష్ట్ర ఎన్నికల సంఘం, రాష్ట్ర ప్రభుత్వం సూచనల తో ఇప్పటికే బ్యాలెట్ పేపర్ల ముద్రణను పూర్తి చేశారు. బ్యాలెట్ బాక్స్‌లను అందుబాటులోకి తీసుకువస్తున్నారు. పోలింగ్ కేంద్రాల్లో అవసరమైన సౌకర్యాల కల్పనకు శ్రీకారం చుట్టారు.
సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలపై దృష్టి
జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల నేపథ్యంలో ఓటర్ల ముసాయిదాను ఆఫీసర్లు ప్రకటించారు. ఇదే క్రమంలో జిల్లాలో సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలపై జిల్లా పరిషత్ ఆఫీసర్లు పోలీస్‌లతో చర్చిస్తున్నారు. అతి సమస్యాత్మక, సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల వివరాలను తయారు చేస్తున్నట్టు పోలీస్‌లు పేర్కొన్నారు.