ఆఖరి ఓవర్లో 20 పరుగులు..ఉత్కంఠ పోరులో శ్రీలంకను ఓడించిన జింబాబ్వే

ఆఖరి ఓవర్లో 20 పరుగులు..ఉత్కంఠ పోరులో శ్రీలంకను ఓడించిన జింబాబ్వే

జింబాబ్వేకు పసికూన జట్టుగా పేరుంది. గత సంవత్సర కాలంగా ఈ జట్టు పరిస్థితి మరీ దారుణంగా తయారైంది.భారత్ వేదికగా జరిగిన వన్డే వరల్డ్ కప్, 2024 వెస్టిండీస్, అమెరికా వేదికగా జరగనున్న టీ20 వరల్డ్ కప్ కు అర్హత సాధించడంలో విఫలమైంది. ఈ నేపథ్యంలో జింబాబ్వే జట్టు ఒక అద్భుత విజయాన్ని సొంతం చేసుకుంది. శ్రీలంకతో మూడు టీ20 ల సిరీస్ లో భాగంగా రెండో టీ20 లో ఉత్కంఠ పోరులో నెగ్గింది.

కొలొంబోలో జరిగిన ఈ మ్యాచ్ లో ఒకదశలో జింబాబ్వే ఓటమి ఖాయమనుకున్నారు. చివరి ఓవర్లో 20 పరుగులు చేయాల్సిన దశలో క్రీజ్ లో ఎవరూ స్పెషలిస్ట్ బ్యాటర్లు లేరు. కానీ ఏంజెలో మాథ్యూస్ వేసిన చివరి ఓవర్లో అద్భుతమే జరిగింది.జింబాబ్వే బ్యాటర్ ల్యూక్ జాంగ్వె రెండు సిక్స్ లు బాది తమ టీమ్ కు చారిత్రక విజయం సాధించి పెట్టాడు. 174 పరుగుల లక్ష్యాన్ని చివరి బంతికి జింబాబ్వే టీమ్ చేజ్ చేసింది. నాలుగు వికెట్లతో గెలిచి.. మూడు టీ20ల సిరీస్ ను 1-1తో సమం చేసింది. తొలి టీ20లో శ్రీలంక గెలవగా.. ఈ మ్యాచ్ గెలిచి ప్రతీకారం తీర్చుకుంది.

అంతర్జాతీయ టీ20 క్రికెట్ లో తొలిసారి శ్రీలంకను జింబాబ్వే ఓడించింది. శ్రీలంక ఇన్నింగ్స్ లో 66 రన్స్ చేసి హీరోగా నిలిచిన ఏంజెలో మాథ్యూస్ బౌలింగ్ లో మాత్రం విలన్ అయ్యాడు. జింబాబ్వే బ్యాటర్ ల్యూక్ జాంగ్వె 12 బంతుల్లోనే 25 రన్స్ చేశాడు. అతని ఇన్నింగ్స్ లో 2 ఫోర్లు, 2 సిక్స్ లు ఉన్నాయి. అతనికే మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు దక్కడం విశేషం. అంతకుముందు బౌలింగ్ లోనూ అతడు 2 వికెట్లు తీసుకున్నాడు. 

ఈ మ్యాచ్ లో మొదట బ్యాటింగ్ చేసిన శ్రీలంక నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 173 పరుగులు చేసింది. సీనియర్ బ్యాటర్ మాథ్యూస్.. 51 బంతుల్లో 66 పరుగులు, అసలంక 39 బంతుల్లో 69 పరుగులు చేశారు.  శ్రీలంక 27 రన్స్ కే 4 వికెట్లు కోల్పోయినా.. మాథ్యూస్, అసలంక ఐదో వికెట్ కు 118 రన్స్ జోడించడంతో లంక మంచి స్కోరు సాధించింది. లక్ష్య ఛేదనలో జింబాబ్వే ఒక బంతి మిగిలి ఉండగానే ఛేజ్ చేసింది. ఏర్విన్ 54 బంతుల్లో 70 పరుగులు చేసి టాప్ స్కోరర్ గా నిలిచాడు.