మానవత్వంతో మనసు గెలిచారు: క్రికెటర్ల మ్యాచ్ ఫీజ్.. ట్రస్ట్‌కు ఇచ్చేసిన జింబాబ్వే క్రికెట్

మానవత్వంతో మనసు గెలిచారు: క్రికెటర్ల మ్యాచ్ ఫీజ్.. ట్రస్ట్‌కు ఇచ్చేసిన జింబాబ్వే క్రికెట్

జింబాబ్వే క్రికెట్ అంటే జనాలు పట్టించుకోవడం ఎప్పుడో మానేశారు. ఒకప్పుడు అరకొర రాణిస్తూ సంచలన ఫలితాలను నమోదు చేసే ఆ ఆ జట్టు ప్రస్తుతం అత్యంత దారుణంగా ఆడుతుంది. భారత్ వేదికగా జరిగిన వన్డే వరల్డ్ కప్ కు అర్హత సాధించలేకపోయిన ఆ జట్టు.. 2024 టీ20 వరల్డ్ కప్ ఆడే 20 జట్లలో స్థానం సంపాదించలేకపోయింది. కెప్టెన్ సికిందర్ రాజా ఒక్కడే వారియర్ లా పోరాడుతున్నా..  మిగిలిన వారు  కనీస ప్రదర్శన చేయలేకపోతున్నారు. దీంతో జింబాబ్వే పసికూన జట్టు కంటే అద్వానంగా ఉందనే భావన వినిపిస్తుంది. 

ఆటగాళ్లకు తక్కువగా జీతాలు ఇవ్వడం.. కొన్నిసార్లు అవి కూడా లేకపోవడంతో జింబాబ్వే క్రికెట్ బోర్డు ఆర్ధికంగా వెనుకపడింది. ఇన్ని ప్రతికూలతల ఉన్నప్పటికీ.. ఆ దేశ క్రికెట్ బోర్డు పిల్లల కోసం ఒక గొప్ప నిర్ణయం తీసుకుంది. క్రికెటర్ల మ్యాచ్ ఫీజ్ మొత్తాన్ని చిన్నపిల్లలా క్యాన్సర్ ట్రస్ట్ కు ఇచ్చేశారు. నిన్న(డిసెంబర్ 17) ఐర్లాండ్ తో స్వదేశంలో జరిగిన మూడో వన్డే తర్వాత ఈ కీలక నిర్ణయం తీసుకుంది. అసలే ఆర్ధికంగా కష్టాల్లో ఉన్న జింబాబ్వే క్రికెట్ బోర్డు.. పిల్ల కోసం చూపించిన మానవత్వం అందరినీ ఆకట్టుకుంటుంది.
 
ఈ మ్యాచ్ లో జింబాబ్వే ఓడిపోయినా.. అందరి  మనసులను గెలుచుకుంది. మొదటి బ్యాటింగ్ చేసిన జింబాబ్వే.. 40 ఓవర్లలో 197 పరుగులకు ఆలౌటైంది. 79 పరుగులతో గుంభీ టాప్ స్కోరర్ గా నిలిచాడు. లక్ష్య ఛేదనలో ఐర్లాండ్ 37.5 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి ఛేజ్ చేసింది. బల్బీర్ని 82 పరుగులు చేసి ఆ జట్టును గెలిపించాడు. క్యాంపర్ 40 పరుగులు, టెక్టార్ 33 పరుగులతో రాణించారు. టీ20 సిరీస్ ను 1-2 తేడాతో చేజార్చుకున్న జింబాబ్వే.. వన్డే సిరీస్ ను 0-2 తేడాతో కోల్పోయింది.