Women's T20 World Cup 2024: అమ్మాయిల టీ20 వరల్డ్ కప్ మేం నిర్వహిస్తాం: జింబాబ్వే

Women's T20 World Cup 2024: అమ్మాయిల టీ20 వరల్డ్ కప్ మేం నిర్వహిస్తాం: జింబాబ్వే
  • టీ20 వరల్డ్ కప్ ఆతిథ్యం.. ముందుకొచ్చిన జింబాబ్వే క్రికెట్ బోర్డు
  • పరిశీలనలో యూఏఈ కూడా 
  • 20న నిర్ణయం తీసుకోనున్న ఐసీసీ బోర్డు

హరారే: విమెన్స్‌‌‌‌ టీ20 వరల్డ్ కప్‌‌‌‌నకు ఆతిథ్యం ఇచ్చేందుకు జింబాబ్వే ముందుకొచ్చింది. అక్టోబర్‌‌‌‌‌‌‌‌ 3 నుంచి బంగ్లాదేశ్‌‌‌‌లో వరల్డ్ కప్‌‌‌‌ జరగాల్సి ఉండగా.. ఆ దేశంలో  రాజకీయ అనిశ్చితి కారణంగా టోర్నీని మరో చోటుకు తరలించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ మెగా ఈవెంట్‌‌‌‌ను నిర్వహించేందుకు బీసీసీఐ నిరాకరించింది. దాంతో యూఏఈలో నిర్వహించాలని ఐసీసీ భావిస్తుండగా.. తాజాగా జింబాబ్వే రేసులోకి వచ్చింది. ఈ నెల 20న జరిగే సమావేశంలో ఐసీసీ బోర్డు వేదికను ఖరారు చేసే అవకాశం ఉంది. 

కాగా, 2018, 2023లో వన్డే వరల్డ్ కప్‌‌‌‌ క్వాలిఫయర్స్‌‌‌‌ను విజయవంతంగా నిర్వహించిన జింబాబ్వే.. ఈ టోర్నీకి ఆతిథ్యం ఇచ్చి మెగా ఈవెంట్లకు తమ దేశాన్ని వేదికగా మార్చాలని ఆలోచిస్తోంది. 2003లో సౌతాఫ్రికా, కెన్యాతో కలిసి వన్డే వరల్డ్ కప్‌‌‌‌నకు ఆతిథ్యం ఇచ్చింది. ఈ టోర్నీతో సహా విమెన్స్‌‌‌‌ వరల్డ్ కప్‌‌‌‌లో జింబాబ్వే పోటీ పడలేదు. అయినా మెగా ఈవెంట్‌‌‌‌కు తటస్థ వేదికగా ఉండాలని కోరుకుంటోంది.  కొత్త ఫ్లడ్‌‌‌‌లైట్స్ ఏర్పాటు చేసిన హరారే స్పోర్ట్స్‌‌‌‌ క్లబ్‌‌‌‌, క్వీన్స్‌‌‌‌ స్పోర్ట్స్‌‌‌‌ క్లబ్‌‌‌‌ స్టేడియాలను టీ20 వరల్డ్ కప్ కోసం కేటాయించేందుకు జింబాబ్వే క్రికెట్ బోర్డు సిద్ధంగా ఉంది. అక్టోబర్‌‌‌‌‌‌‌‌లో  ఆ దేశంలో వాతావరణం కూడా టోర్నీకి అనుకూలంగా ఉండనుంది. ఆ సమయంలో  వేసవి మొదలవనుంది. వర్షం కురిసే అవకాశాలు చాలా తక్కువగా ఉండటం, యూఏఈతో పోలిస్తే నిర్వహణ ఖర్చు చాలా తక్కువ కావడం జింబాబ్వేకు కలిసి రానుంది.