జింబాబ్వే పర్యటనలో భారత యువ జట్టు మరో కీలక పోరుకు సిద్దమైంది. ఐదు మ్యాచ్‌ల టీ20ల సిరీస్‌లో భాగంగా శనివారం(జులై 13) ఇరు జట్ల మధ్య నాలుగో టీ20 జరగనుంది. ఈ సిరీస్‌లో ఇప్పటికే 2-1తో ఆధిక్యంలో ఉన్న భారత్.. నాలుగో టీ20లో విజయం సాధించి మరో మ్యాచ్ మిగిలి ఉండగానే సిరీస్ కైవసం చేసుకోవాలనుకుంటోంది.
ఇదిలావుంటే, ఈ కీలక మ్యాచ్‌లో రాణించి రెండు ఆల్ టైమ్ రికార్డులను తన ఖాతాలో వేసుకోవాలని జింబాబ్వే కెప్టెన్ సికందర్ రజా ఎదురు చూస్తున్నాడు. 38 ఏళ్ల రజా టీ20ల్లో 2000 పరుగులు చేసిన మొదటి జింబాబ్వే ఆటగాడిగా అవతరించడానికి 17 పరుగుల దూరంలో ఉన్నాడు. అలాగే, టీ20ల్లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా చరిత్ర సృష్టించడానికి, పేసర్ ల్యూక్ జోంగ్వే(66 వికెట్లు) దాటడానికి అతనికి మరో రెండు వికెట్లు అవసరం.
ఈ కుడిచేతి వాటం బ్యాటర్ 89 టీ20ల్లో 133.26 స్ట్రైక్ రేట్‌తో 1983 పరుగులు చేశాడు. ఇక బౌలింగ్‌లో 7.05 ఎకానమీ రేటుతో 65 వికెట్లు పడగొట్టాడు. ఈ గణాంకాలే బాగానే ఉన్నా.. భారత్‌తో టీ20 సిరీస్ లో అతని ప్రదర్శన ఆశాజనకంగా లేదు. దారుణంగా విఫలమవుతున్నాడు.
తుది జట్లు (అంచనా)
భారత్: యశస్వి జైస్వాల్, శుభ్‌మన్ గిల్(కెప్టెన్), రుతురాజ్ గైక్వాడ్, అభిషేక్ శర్మ, సంజూ శాంసన్, రింకూ సింగ్, శివమ్ దూబే, వాషింగ్టన్ సుందర్, రవి బిష్ణోయ్, ఆవేశ్ ఖాన్, ఖలీల్ అహ్మద్.
జింబాబ్వే: మారుమణి, వెస్లీ మాధేవెరే, బ్రియాన్ బెన్నెట్, డియోన్ మైయర్స్, సికందర్ రజా(కెప్టెన్), జోనాథన్ కాంప్‌బెల్, క్లైవ్ మదాండే(వికెట్ కీపర్), వెల్లింగ్టన్ మసకద్జా, రిచర్డ్ నగరవ, బ్లెస్సింగ్ ముజరబానీ, టెండై చతారా.