ZIM vs PAK: నరాలు తెగే ఉత్కంఠ.. పాకిస్థాన్‌పై జింబాబ్వే థ్రిల్లింగ్ విక్టరీ

ZIM vs PAK: నరాలు తెగే ఉత్కంఠ.. పాకిస్థాన్‌పై జింబాబ్వే థ్రిల్లింగ్ విక్టరీ

పాకిస్థాన్ తో మూడు టీ20 ల సిరీస్ లో భాగంగా జింబాబ్వే వైట్ వాష్ ప్రమాదం నుంచి బయట పడింది. గురువారం (డిసెంబర్ 5) బులవాయోలో జరిగిన చివరి టీ20 మ్యాచ్ లో పాకిస్థాన్ కు షాక్ ఇచ్చింది. లో స్కోరింగ్ థ్రిల్లింగ్ మ్యాచ్ లో రెండు వికెట్ల తేడాతో విజయం సాధించి తమా దేశ చరిత్రలో అద్భుతమైన విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. పాకిస్థాన్ విధించిన 133 పరుగుల లక్ష్యాన్ని జింబాబ్వే మరో బంతి మిగిలి ఉండగానే ఛేజ్ చేసింది.

ఈ మ్యాచ్ లో మొదట బ్యాటింగ్ చేసిన పాకిస్థాన్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 132 పరుగులు మాత్రమే చేసింది. కెప్టెన్ సల్మాన్ అఘా 32 పరుగులతో టాప్ స్కోరర్ గా నిలిచాడు. జింబాబ్వే బౌలర్ ముజారబానీని రెండు వికెట్లు తీయడంతో పాటు పొదుపుగా బౌలింగ్ చేశాడు. 133 పరుగుల లక్ష్య ఛేదనలో ఓపెనర్ బెన్నెట్ రెచ్చిపోవడంతో జింబాబ్వే జట్టు విజయం దిశగా దూసుకెళ్లింది. డెత్ ఓవర్లలో పాక్ బౌలర్లు పొదుపుగా బౌలింగ్ చేయడంతో వికెట్లు తీయడంతో మ్యాచ్ ఆసక్తికరంగా మారింది.

చివరి ఓవర్లో విజయానికి 12 పరుగులు కావాల్సిన దశలో మాపొసా సిక్స్, ఫోర్ కొట్టి తమ జట్టుకు విజయాన్ని అందించాడు. ఈ మ్యాచ్ తో మూడు మ్యాచ్ ల టీ20 సిరీస్ ను పాకిస్థాన్ 2-1 తేడాతో గెలుచుకుంది. అంతకముందు మూడు వన్డేల సిరీస్ ను కూడా పాకిస్థాన్ 2-1 తేడాతో విజయం సాధించింది. బెన్నెట్ కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్.. సుఫియాన్ ముఖీమ్ కు ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డులు లభించాయి.